ప్రతి మనిషి జీవితంలో చిట్ట చివరి ప్రస్థానం శ్మశాన వాటికకే. పుట్టుకకు ఎంత ప్రాధాన్యం ఉందో, చావుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం మన సంప్రదాయం. అందుకే జీవితంలో చివరి మజిలీని ఎంతో గౌరవంగా అంతిమ సంస్కారం, దహన సంస్కారం అని పిలుచుకుంటాం. అందుకే మనిషి తన చివరి ప్రయాణం నలుగురి చేతుల మీదుగా గౌరవంగా సాగాలని పరితపిస్తాడు.
ఒక మనిషి బతికిన బతుకు అతను లేదా ఆమె చావులో తెలుస్తుందంటారు. కానీ కరోనా కాలంలో అన్నీ తలకిందులయ్యాయి. బంధాలు, అనుబంధాలకు కరోనా కాలంలో తావు లేదు. ఎవరి బతుకు వాళ్లదన్నట్టుగా తయారైంది. దీనికి తోడు కరోనా వ్యాప్తిపై సాగుతున్న ప్రచారం అనేక అనుమానాలు, మూఢత్వానికి దారి తీసింది. అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా వస్తుందనే ప్రచారం… సొంత రక్త సంబంధీకుల అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేని దుస్థితిని కల్పించింది.
కరోనా మహమ్మారి సృష్టించిన అమానవీయత అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌బారిన పడి ప్రాణాలు విడిచిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పాల్గొని మూఢ విశ్వాసాలను, అపనమ్మకాల్ని తొలగించే ప్రయత్నం చేశారు. తిరుపతిలోని గోవింద ధామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.
మృతదేహానికి స్వయంగా ఆయన దహన క్రియల్ని నిర్వహించి ప్రజల్లో భయాల్ని, అపోహల్ని పారదోలే ప్రయత్నం చేయడం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తిపై నెలకున్న భయాల్ని తొలగించే క్రమంలో స్వయంగా కోవిడ్ మృతదేహానికి దగ్గరుండి దహన క్రియల్ని నిర్వహించినట్టు తెలిపారు.
ఏవేవో అపోహలతో సొంత వాళ్లకు కూడా అంతిమ సంస్కారం నిర్వహించకుండా జీవితాంతం ఆ ఆవేదనతో బతకాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని అంత్య క్రియలు నిర్వహించవచ్చన్నారు. ఆ విషయాన్ని ఆచరించి చూపడం ద్వారా చైతన్యం తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా తాను ముందుకు వచ్చినట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. కావున కోవిడ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏ ఒక్కరూ భయపడొద్దని ఆయన కోరారు.