తెదేపాకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా లేవు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ఇతర పార్టీల నుంచి, అక్కడ గతి లేకుండా పోయిన నాయకులు ఎవరో ఒకరు తమ పంచకు వచ్చి చేరుతారని తెలంగాణ తెలుగుదేశం ఆశిస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లుగా పార్టీలో…

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ఇతర పార్టీల నుంచి, అక్కడ గతి లేకుండా పోయిన నాయకులు ఎవరో ఒకరు తమ పంచకు వచ్చి చేరుతారని తెలంగాణ తెలుగుదేశం ఆశిస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లుగా పార్టీలో మిగిలిన వారు కూడా ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటూ ఉండడంతో చిట్టచివరి దింపుడు కళ్లెం ఆశలు కూడా దిగనాసిల్లి పోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా సీతా దయాకర్ రెడ్డి ఇపుడు కాంగ్రెస్ లో చేరనుండడమే ఇందుకు ఉదాహరణ.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శవాసనం వేసి చాలా కాలం అయింది. చంద్రబాబునాయుడు హైదరాబాదులోని తన నివాసానికి వచ్చినప్పుడు.. ఏదో మొక్కుబడిగా నలుగురు నాయకులతో మాట్లాడి.. తెతెదేపా సమావేశం జరిగినట్టుగా బిల్డప్ ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప.. ఈ పార్టీని తిరిగి బట్టకట్టేలా చేయడానికి దృష్టి పెట్టింది కూడా లేదు. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ సారథి అయిన తర్వాత.. ఆయన కాస్త హడావుడి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని కూడా అంటున్నారు.

ఇంత గట్టిగా ఆ మాట చెప్పడానికి తెలుగుదేశానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి వారికి ప్రతిచోటా కేండిడేట్ దొరకడం కూడా కష్టమే. కానీ.. ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడే ద్వితీయశ్రేణి నాయకులు, ఒక్కసారైనా ఎమ్మెల్యే అభ్యర్థి అనిపించుకోవాలనుకునే నాయకులు.. వచ్చి తమ పార్టీలో చేరవచ్చునని వారు వేచిచూస్తున్నారు. అన్ని పార్టీల జాబితాలు వెల్లడైపోయిన తర్వాత.. ఒకరో ఇద్దరైనా తెదేపాలోకి రాకపోతారా అనుకుంటున్నారు. 

ఆ ఘట్టం వస్తుందో లేదో గానీ.. తెతెదేపాలో ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులు కూడా బయటకు పోతున్నారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతా దయాకర్ రెడ్డి ఇప్పటిదాకా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. తాజాగా, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, తమ శ్రేయోభిలాషుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఆ రకంగా ఆమె ఆ మూడు నియోజకవర్గాల్లో తనకు ఏదో ఒక సీటు కావాలని కోరుతున్నట్టుగా అయింది. 

రోజులు గడిచే కొద్దీ ఎవరో ఒకరు తమ పార్టీలో చేరకపోతారా అని తెలుగుదేశం ఎదురుచూస్తుండగా.. పార్టీలో ఉన్నవారు కూడా ఒక్కరొక్కరుగా జారిపోతుండడం వారికి పెద్ద దెబ్బే!