జనసేనాని పవన్‌కల్యాణ్‌కు జీవిత భాగస్వామి అన్నా లేజీనోవా బైబిల్‌ను బాగా ఒంటబట్టించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాజకీయంగా తాను ఏదైనా చెప్పాలని అనుకుంటే బైబిల్ సూక్తులను జత చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ మూడో భార్య అన్నా లేజీనోవా క్రిస్టియన్. ఆమె రష్యాకు చెందిన మహిళ. ఆమెని పవన్ ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజాగా జగన్ ప్రభుత్వంపై మద్యనిషేధానికి సంబంధించి విమర్శలు గుప్పించడానికి బైబిల్ వాక్యాన్నిపవన్ కోట్ చేయడం విశేషం. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు “కాదు కాదు” సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్టు పరిస్థితి తయారైందని ఏపీ పాలనపై పవన్ ట్వీట్ చేశారు.
“చిన్న గమనిక: సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు”
అని పవన్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా మద్యం ఆదాయంపై ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన వార్తను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విటర్లో షేర్ చేసిన దానిని పవన్ తెరపైకి తేవడం విశేషం.
ఇటీవల పొత్తు విషయమై పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ కాస్త తగ్గాలని సూచించారు. తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడును అనే బైబిల్ సూక్తిని పవన్ చెప్పారు. ఇప్పుడు మరో బైబిల్ సూక్తి …అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు అని సీఎం జగన్ పేరు ప్రస్తావించకుండానే హెచ్చరించారు.
మతపరంగా జగన్ క్రిస్టియన్. క్రిస్టియన్లకు ఎంతో ఇష్టమైన బైబిల్ సూక్తిని పవన్ తెరపైకి తేవడం ద్వారా సెంటిమెంట్‌తో కొట్టాలనే ప్రయత్నం కనిపించింది. పవన్ భార్య క్రిస్టియానిటీని ఆచరిస్తూ, బైబిల్‌ను ఫాలో అవుతుంటారని, అందువల్లే పవన్ కూడా తరచూ పవిత్ర గ్రంథంలోని సూక్తులను ప్రస్తావిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.