ఇల్లు వదిలేసి ఊరు గురించి మాట్లాడ్డం కేసీఆర్‌కే చెల్లింది. అయితే ఈ పగటి కలల నాయకుల్లో కేసీఆర్ ఫస్ట్ కాదు, లాస్ట్ కూడా కాదు. ఇదో పరంపర. ప్రాంతీయ నాయకులతో చిక్కు ఏమంటే వాళ్లు తమని తాము ఎక్కువ ఊహించుకుంటారు. ప్రాంతీయ పార్టీ అంటే పూర్తిగా వాళ్ల రెక్కల కష్టం. వాళ్లే సుప్రీం. ఒక్కసారి అధికారంలోకి రాగానే తమ పరిధి మరిచిపోతారు. కేంద్రాన్ని సవాల్ చేయడం స్టార్ట్ చేస్తారు.
కేంద్రంలో మధ్యలో వచ్చిన జనతా, ఫ్రంట్‌లు కాకుండా ఎక్కువ కాలం అధికారంలో వున్నది కాంగ్రెస్, బీజేపీ. అవసరమైనప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకున్నా కేంద్రంలో అధికారం మాత్రం జాతీయపార్టీలదే.
కేంద్రంలో వున్న పార్టీనే రాష్ట్రంలో కూడా వుంటే సమస్యే లేదు. అయితే రెండూ ప్రత్యర్థులైతేనే ప్రాబ్లం. కాంగ్రెస్‌ని ఓడించి టీడీపీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ 1984లో ఎన్టీఆర్‌ని దించేసింది. జనం బలం వుంది కాబట్టి మళ్లీ వచ్చాడు. దాంతో కేంద్రంపై మంటతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశాడు. భారతదేశం అనే పార్టీ పేరు కూడా సీన్‌లోకి వచ్చింది. నేషనల్ ఫ్రంట్‌లో కీలకంగా మారాడు కానీ, 89లో రాష్ట్రంలో టీడీపీ ఓడడంతో దెబ్బతిన్నాడు.
చంద్రబాబుకి కూడా చక్రం తిప్పాలని కోరిక. కొన్నాళ్లు తిప్పాడు కూడా. అక్కడ ఇతన్ని మించిన మేథావులు వుండడంతో అలవాటైన లాబీయింగ్ చేశాడు తప్ప ధైర్యంగా దూకలేదు.
శరత్‌పవార్, మమత కూడా జాతీయ స్థాయి ఆలోచనల్లో వున్నా, వీళ్లెవరూ ఒకటి కాకపోడానికి కారణం ఇగో. తమకి తాము గొప్పవాళ్లు, దేవుళ్లు అనుకునే ప్రాంతీయ నాయకులు ఒక్కటై, తమలో ఒకన్ని ఏకాభిప్రాయంతో నాయకుడిగా ఎంచుకోవడం అసాధ్యం. అదే బీజేపీ ధైర్యం కూడా.
టీఆర్ఎస్ అసలే ఇబ్బందుల్లో వుంది. రెండు టర్ములు పాలనతో జనంలో అసంతృప్తి వుంది. కేసీఆర్ చెప్పిన అద్భుతాలేవీ జరగలేదని అర్థమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంతోకొంత బలపడుతున్నాయి. కేసీఆర్ గురించి బాగా తెలిసిన వాళ్లు, ఆయన మాటలు నమ్మి స్నేహం చేసి జట్టు కట్టరు. బీజేపీకి వ్యతిరేకత వుంది నిజమే. కానీ దానికి కేసీఆర్ జాతీయ పార్టీ చాలదు.
కృశించిపోతున్న కాంగ్రెస్, కప్పల తక్కెడ లాంటి ప్రాంతీయ నాయకులు కలిసి తమను ఏం చేయలేరనే ధీమా బీజేపీది. ఇది నిజం కూడా!