జనాల నోట్లో పూరీ పెట్టిన కేంద్ర మంత్రి

ఆయన పేరులో పూరీ ఉంది. మాటలలో తీపి ఉంది. ఇంకేం నోట్లోనే వంటకం వండేసి జనాలకు ఎంచక్కా తినిపించే సామర్ధ్యమూ ఉంది. విశాఖలో లేటెస్ట్ గా టూర్ చేస్తున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…

ఆయన పేరులో పూరీ ఉంది. మాటలలో తీపి ఉంది. ఇంకేం నోట్లోనే వంటకం వండేసి జనాలకు ఎంచక్కా తినిపించే సామర్ధ్యమూ ఉంది. విశాఖలో లేటెస్ట్ గా టూర్ చేస్తున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అయితే చాలా చాలా తీయని మాటలు జనాలకు చెప్పారు.

ఈ రోజు పెట్రోల్ డీజిల్ సెంచరీలు దాటేసి మరీ దూకుడు చేస్తున్నాయి. అయితే పెట్రోల్ మీద కేంద్రం పది రూపాయలు తగ్గించి దేశ ప్రజలకు బీజేపీ మహోపకారం చేసిందని పూరీ గారు చెబుతూండడమే ఇక్కడ విశేషం. మేము చాలా ఎక్కువే  తగ్గించాం, కాబట్టి రాష్ట్రాల‌దే ఇక బాధ్యత. అందువల్ల వారు పెట్రోల్ మీద భారాలు తగ్గించాలని ఉచితమైన సలహాలు ఇస్తున్నారు.

నిజానికి లీటర్ డెబ్బైలలో ఉన్న పెట్రోల్ ని వందలు దాటించిన ఘనత ఎవరిదో మాత్రం కేంద్ర మంత్రి కనీసంగా ప్రస్థావించకపోవడమే చిత్రాతిచిత్రం. అంతే కాదు పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అన్నది కేంద్రం చేతిలో లేదని చేతులు దులిపేసుకున్నారు. దీనికి రాష్ట్రాలు అన్నీ కూడా అంగీకరించాలని ఆయన చెబుతున్నారు.

ఇక దేశంలో పెట్రోల్ కొరత లేదని, అదంతా కేంద్రం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల ఫలితమే అని కూడా ఆయన గొప్పగా చెప్పుకున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావాన్ని అలా తాము అధిగమించామని కూడా పేర్కొన్నారు.