వైసీపీ అధిష్టానం మొద్దు నిద్ర‌!

వైసీపీ అధిష్టానం మొద్దు నిద్ర‌లో వుందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు పార్టీ పెద్ద‌లంతా కొలువైన విజ‌య‌వాడ‌కు కూత‌వేటు దూరంలో అస‌మ్మ‌తి రోజురోజుకూ పెరుగుతోంటే, ఎలాంటి చ‌ర్య‌లు…

వైసీపీ అధిష్టానం మొద్దు నిద్ర‌లో వుందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు పార్టీ పెద్ద‌లంతా కొలువైన విజ‌య‌వాడ‌కు కూత‌వేటు దూరంలో అస‌మ్మ‌తి రోజురోజుకూ పెరుగుతోంటే, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దేనికి నిద‌ర్శ‌నం? టీడీపీ త‌ర‌పున గెలుపొందిన వ‌ల్ల‌భ‌నేని వంశీని అక్కున చేర్చుకున్న వైసీపీ, అంత వ‌ర‌కూ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన వాళ్ల‌కు ఏదో ఒక‌టి స‌ర్ది చెప్పాల్సి వుంది.

ఆ ప‌ని ఎంత మాత్రం చేస్తున్నారో తెలియ‌దు కానీ, వ‌ర్గ‌పోరు మాత్రం తీవ్ర‌స్థాయికి చేరింది. వ‌ల్ల‌భ‌నేని వంశీపై ఇంత కాలం దుట్టా రామ‌చంద్ర‌రావు మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఆయ‌న‌కు దీటుగా వ‌ల్ల‌భ‌నేని స‌మాధానాలు ఇస్తూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల దుట్టా రామ‌చంద్ర‌రావు, ఆయ‌న అల్లుడు డాక్ట‌ర్ శివ‌భారత్‌రెడ్డిని వైసీపీ పెద్ద‌లు పిలిపించుకుని చ‌ర్చించారు. ఇదే సంద‌ర్భంలో వ‌ల్ల‌భ‌నేని వంశీని కూడా పిలిపించుకుని మాట్లాడి పంపారు.

అంతా స‌ర్దుకుందని భావించారు. అదేంటో గానీ, వైసీపీ పెద్ద‌లు పంచాయితీ చేసిన త‌ర్వాతే గ‌న్న‌వ‌రంలో వ‌ర్గ‌పోరు మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం దుట్టా, ఆయ‌న అల్లుడు శివ‌భార‌త్‌రెడ్డికి మ‌రో నాయ‌కుడు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తోడ‌య్యారు. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాన్ని హీటెక్కించారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ నిన్న ఘాటు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థులు అదే స్థాయిలో స్పందించడం గ‌మ‌నార్హం.

వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీ టికెట్ ఇస్తే చేసే ప్ర‌శ్నే లేద‌ని దుట్టా రామ‌చంద్ర‌రావు తేల్చి చెప్పారు. డాక్ట‌ర్ శివ‌భారత్‌రెడ్డి కూడా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వ‌ల్ల‌భ‌నేని మాన‌సిక స్థితి బాగా లేక‌పోతే ఎక్క‌డైనా చూపించుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు మాత్రం వ‌ల్ల‌భ‌నేనిలా సంస్కారం లేని మాట‌లు మాట్లాడ‌న‌న్నారు. టికెట్ త‌న‌కే అని స్ప‌ష్టం చేశారు. 

ఇలా గ‌న్న‌వ‌రంలో పాత‌, కొత్త వైసీపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం మీడియాకెక్కి తిట్టుకుంటుంటే అధిష్టానం ఏం చేస్తోంది? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అది కూడా పిలిచి మాట్లాడేంత దూరంలో ఉంటూ, అధికార పార్టీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం తిట్టుకుంటూ, క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తున్నా ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఈ రేంజ్‌లో కాక‌పోయినా మ‌చిలీప‌ట్నంలో కూడా ఇదే అసంతృప్తి. మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డ వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. మీడియాకెక్కి విమ‌ర్శించుకున్న‌ప్పుడు ….ఫోన్ చేసి మౌనం పాటించాల‌నే ఆదేశాలు త‌ప్ప‌, మ‌రెలాంటి చ‌ర్య‌లు తీసుకోరా? స‌మ‌స్య‌ల్ని గుర్తించి వాటి ప‌రిష్కార మార్గాలు అన్వేషించడానికి బ‌దులు, మౌనంతో మ‌రింత పెరిగేలా వైసీపీ అధిష్టానం ప్ర‌వ‌ర్తిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీలో ఇలాంటివి నివురుగ‌ప్పిన నిప్పులా మ‌రికొన్ని చోట్ల కూడా వున్న‌ట్టు తెలుస్తోంది. కనీసం రాబోవు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునైనా అస‌మ్మ‌తి తొల‌గించేందుకు అధిష్టానం పెద్ద‌లు ప్ర‌య‌త్నించాలి. లేదంటే త‌మ‌కు తామే న‌ష్టం క‌లిగించే ప్ర‌మాదం పొంచి వుంద‌ని గ్ర‌హించాలి.