కేసీఆర్ జీ “హుజూర్”.. గెలుపు కారణాలివే!

ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులయ్యాయి. ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠ ఉంటుందనే విశ్లేషణలు తుస్సుమన్నాయి. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ,…

ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులయ్యాయి. ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠ ఉంటుందనే విశ్లేషణలు తుస్సుమన్నాయి. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ, అతి తక్కువ కాలంలోనే జరిగిన ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించింది. ఇది ఎలా సాధ్యమైంది? టీఆర్ఎస్ గెలుపునకు దోహదపడిన అంశాలేంటి?

సాధారణంగా ఉపఎన్నిక ఎక్కడ జరిగినా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే గెలుస్తుంది. ఇది 90శాతం ఉపఎన్నికల్లో కంటికి కనిపించిన నిజం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీనే గెలిపిస్తే నియోజకవర్గానికి అంతోఇంతో మేలు జరుగుతుందని, నిధులొచ్చి తమ ప్రాంతం బాగుపడుతుందని ప్రజల నమ్మకం. అదే నమ్మకం హుజూర్ నగర్ ప్రజల్లో కూడా కనిపించింది. ఆ నమ్మకమే ఓట్ల రూపంలో వెల్లువెత్తింది.

ఇదొక కారణమైతే.. సామాజిక వర్గం అంశం కూడా మరో కారణం. స్థానికంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం మొత్తం ఏకమైంది. అంతాకలిసి గంపగుత్తగా సైదిరెడ్డికే ఓటేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కు చెందిన రేవంత్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తనవర్గం ఓటును చీల్చలేకపోయారు. దీనికి కారణం సెంటిమెంట్ ఓటు కూడా.

గత ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డిపై జనాల్లో సానుభూతి పెరిగింది. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం, మరీ ముఖ్యంగా స్థానికుడు కావడంతో ఈసారి సైదిరెడ్డికి ఓటేద్దామనేవాళ్లు ఎక్కువయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ప్రకటిస్తున్న వరాలే మరో విజయాన్ని అందించాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ.. ఈ విషయంలో టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు కంటే కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రచార తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు. ప్రజలకు ఏం కావాలో వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్టీసీ సమ్మె అంశాన్ని, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల్ని, రాష్ట్రం అప్పుల పాలైందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. ఇవేవీ నేరుగా నియోజకవర్గంతో సంబంధం లేని అంశాలు. ప్రజలు రాష్ట్ర సమస్యల కంటే తమ స్థానిక సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో టీఆర్ఎస్ గెలుపు సునాయాసమైంది.

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా నిరాశకు గురైంది. తమకు కంచుకోటలా భావించిన హుజూర్ నగర్ ఇంతలా దెబ్బకొడుతుందని ఆ పార్టీ ఊహించలేకపోయింది. భారీ ఓట్ల తేడాతో పద్మావతి రెడ్డి ఓడిపోవడం ఆ పార్టీకి షాకిచ్చింది.

యూజ్‌ అండ్‌ త్రో కెసియార్‌