ఆన్ లైన్ లో సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుక రాళ్లు, చిత్తు కాగితాలు వస్తున్నాయనే ఉదాహరణలు చాలా చోట జరిగాయి. కేరళలోని కొచ్చిలో ఇలాంటిదే మరో విచిత్రం జరిగింది.
ఐఫోన్-12 ఆర్డర్ చేస్తే.. పార్సిల్ లో విమ్ బార్ వచ్చింది. బోనస్ గా 5 రూపాయల బిల్ల కూడా అందులో ఉంది. అమెజాన్ డెలివరీ బాయ్ ముందే అన్ బాక్సింగ్ వీడియో చేద్దామనుకున్న కస్టమర్ ఆ దెబ్బతో షాకయ్యాడు. నిజానికి అలా చేయడం అతడికి కలిసొచ్చింది.
కొచ్చి పట్టణానికి చెందిన నూరుల్ అమీన్ ఇటీవల అమెజాన్ లో ఐఫోన్-12 బుక్ చేశారు. రూ. 70,900 ముందుగానే చెల్లించాడు. అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిగాయి. 3 రోజుల్లో అమెజాన్ డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు. ఫోన్ తీసుకొస్తున్నానని చెప్పాడు.
ఎగిరిగంతేసిన నూరుల్.. పార్శిల్ బాయ్ రాగానే అన్ బాక్సింగ్ వీడియో చేయడానికి రెడీ అయ్యాడు. కవర్ తీశాడు, బాక్స్ విప్పాడు.. తీరా అందులో విమ్ బార్ చూసి షాకయ్యాడు. 5 రూపీస్ కాయిన్ కూడా అందులో ఉంది. దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసులో కొత్తకోణం..
ఇప్పటివరకూ ఇలాంటి మోసాల్లో డెలివరీ బాయ్స్ హస్తం ఉండేది. కానీ ఈసారి అసలు సమస్య ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెజాన్ కంపెనీ నూరుల్ కి సారీ చెప్పింది. తమ దగ్గర కొత్త ఫోన్ స్టాక్ లేదని, పూర్తిగా సొమ్ము రీఫండ్ చేసింది. విచిత్రం ఏంటంటే.. నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్-12 ఐఎంఈఐ నెంబర్ తో దాన్ని ట్రేస్ చేయగా జార్ఖండ్ లో ఆ ఫోన్ వినియోగిస్తున్నట్టు తేలింది.
ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆ ఫోన్ సెప్టెంబర్ నుంచి రన్నింగ్ లో ఉంది. అక్టోబర్ లో ఆర్డర్ ఇచ్చిన ఫోన్, సెప్టెంబర్ లోనే వేరే అడ్రస్ కి డెలివరీ కావడం, దాన్ని ఉపయోగించడం అన్నీ జరిగిపోయాయి. అసలిలాంటి మోసం ఎలా జరిగిందా అని అటు అమెజాన్ నిర్వాహకులు, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు తలలు పట్టుకున్నారు.