పట్టాభి ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ మిస్ అయ్యారు. పార్టీ ఆఫీస్ పై దాడి జరిగినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం హిందూపురంలో ఆయన కార్యాలయంపై దాడి జరిగినా కూడా ఆయన నోరెత్తలేదు. పోనీ ఏదో బిజీలో ఉన్నాడనుకుందాం.
కనీసం బావ చేపట్టిన దీక్ష కూడా బాలయ్యకు పట్టదా అని సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అలకలో ఉన్న కేశినేని నాని వంటి బ్యాచ్ కూడా దీక్షను అడ్డు పెట్టుకుని ప్యాచప్ చేసుకోడానికి వచ్చేసింది. మరి బాలయ్య ఎందుకు మిస్ అయినట్టు. చంద్రబాబు దీక్షను ఆయన అంత లైట్ తీసుకున్నారా..?
బాలయ్య తీరే వేరు..
అసలు బాలకృష్ణ కొన్నాళ్ల పాటు ఏపీ రాజకీయాలతో సంబంధం లేనట్టే ఉంటారు. మరికొన్ని రోజులు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటారు, ఇంకొన్ని రోజులు సినిమాలు, ఆహా టాక్ షో లంటూ సందడి చేస్తారు.
సడన్ గా మూడొస్తే.. రాయలసీమ నీటి పోరాటానికి నేతృత్వం వహిస్తారు. తాజాగా పట్టాభి ఎపిసోడ్ లో అసలు బాలయ్య పాత్రే లేనట్టు కనిపిస్తోంది. దాదాపుగా చిన్నా పెద్దా అందరూ ఈ విషయంలో స్పందించగా బాలయ్య మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు.
ఆహాతో బిజీగా ఉన్నారా..?
బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న టాక్ షో షూటింగ్ ఇటీవల జోరుగా సాగుతోంది. అందులో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ కారణం వల్లే ఆయన దీక్షా శిబిరానికి రాలేకపోయారని కూడా వినిపిస్తోంది.
అయితే పార్టీ కార్యాలయంపై దాడి అనే పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని టీడీపీ రాద్ధాంతం చేస్తున్న సందర్భంలో.. దాన్ని అడ్డు పెట్టుకుని ఏపీలో రాష్ట్రపతిపాలన రావాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న సందర్భంలో బాలయ్య ఇలా మేకప్ వేసుకుంటూ బిజీగా ఉండటం ఏమీ బాగోలేదని అంటున్నాయి టీడీపీ వర్గాలు.
మరి లేట్ గా అయినా బాలయ్య రంగంలోకి దిగుతారా.. బోసడీకే అనే పదాన్ని అడ్డం పెట్టుకుని బావని చెడామడా తిట్టేసిన వైసీపీపై కన్నెర్ర చేస్తారా..? ఏమో.. ఆ అఖండుడి మనసులో ఏముందో హిందూపురం జనాలకి కూడా తెలియదు.