ఈ సంక్రాంతి.. టెన్షన్.. టెన్షన్

ఎప్పుడు లేనంతగా ఈసారి సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు రాబోతున్నాయి. వస్తామని ఢంకా భజాయించి మరీ చెబుతున్నాయి. కానీ అలా చెబుతున్న ప్రతి సినిమాకూ ఏదో సమస్య వుండనే వుంది. ఏ సినిమా కూడా…

ఎప్పుడు లేనంతగా ఈసారి సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు రాబోతున్నాయి. వస్తామని ఢంకా భజాయించి మరీ చెబుతున్నాయి. కానీ అలా చెబుతున్న ప్రతి సినిమాకూ ఏదో సమస్య వుండనే వుంది. ఏ సినిమా కూడా కంఫర్ట్ బుల్ గా లేదు. అంతో ఇంతో కంఫర్ట్ గా వున్నది విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా మాత్రమే.

సంక్రాంతి బరిలో వున్న బలమైన సినిమా గుంటూరు కారం. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కనుక అగ్రతాంబూలం దీనికే. కానీ ఈ సినిమా సంక్రాంతి విడుదల మీద ఇంకా పదిశాతం అయినా అనుమానాలు ఇండస్ట్రీలో వున్నాయి. సినిమా వర్క్ చాలా టైట్‌గా వుండడమే దీనికి కారణం. ఈ సినిమాకు సంబంధించి పెండింగ్ లో వున్న వర్క్ చూస్తే నాలుగు పాటలు తీయాల్సి వుంది. అంటే కనీసం ఇరవై రోజులు. అది కాక ఓ వారం రోజులు అయినా టాకీ వర్క్ వుంది. అంటే దాదాపు దగ్గర దగ్గర ముఫై రోజులు వర్క్ వున్నట్లే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కి వచ్చి తీరాలన్నది సంకల్పంగా వుంది. అందువల్ల గుంటూరు కారం సినిమా సంక్రాంతి కి తీరుతుంది. అందులో సందేహం లేదు.

కానీ చాలా సినిమాలు డేట్ లు వేయడానికి కారణం మాత్రం గుంటూరు కారం వర్క్ అవుతుందా అన్న చిన్న అనుమానాలు వుండడమే. దిల్ రాజు- విజయ్ దేవరకొండ- పరుశురామ్ కాంబినేషన్ ఫ్యామిలీస్టార్ సినిమాను సంక్రాంతికే అని ప్రకటించారు. కానీ వచ్చే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా షూట్ అమెరికాలో కొంత జరగాల్సి వుంది. వీసాల సమస్య వుంది. వేరే చోట్ల చేద్దాం అనుకున్నారు కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు. అందువల్ల ఇక ఈ సినిమా సంక్రాంతికి రానట్లే.

రవితేజ ఈగిల్ సినిమా వుండనే వుంది. దీనికి వర్క్ సమస్య పెద్దగా లేదు. డిసెంబర్ ఫస్ట్ వీక్ కే అంతా రెడీ అయిపోతుంది. థియేటర్ మార్కెటింగ్ కూడా అయింది. కానీ నాన్ థియేటర్ మార్కెటింగ్ మాత్రం ఇంకా డిస్కషన్ లో వుంది. అది పూర్తయితే ఏ సమస్య లేనట్లే.

హనుమాన్ సినిమాకు అవుట్ పుట్ సమస్య, మార్కెటింగ్ సమస్యలు లేవు. కానీ సంక్రాంతికి వస్తే పెద్ద పెద్ద సినిమాల మధ్య థియేటర్లు దొరుకుతాయా అన్నదే సమస్య. గుంటూరుకారం, సైంధవ్ , ఈగిల్, తరువాత ప్రయారిటీ వుంటుంది తప్ప, వాటితో సమానంగా కాదు. కానీ వెనక్కు వెళ్దామంటే డేట్లు కుదరడం లేదు.

నాగ్ నా సామిరంగ సినిమా సంక్రాంతి దిశగా రెడీ అవుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌కు పాటలు మినహా మిగిలిన సినిమా రెడీ అయిపోతుంది. కానీ సంక్రాంతికి థియేటర్లు సంపాదించాలి అంటే అంత సులువు కాదు ఈ ప్రాజెక్ట్ కు. ఎందుకంటే మిగిలిన సినిమాలకు వున్న లెక్కలు వేరు. దీని లెక్క వేరు.

ఇవి కాక రజనీ కాంత్, ధనుష్ ల డబ్బింగ్ సినిమాలు రెండు వున్నాయి. వాటికీ థియేటర్లు కావాలి.

ఇవన్నీ ఇలా వుంచితే డిసెంబర్ మూడో వారంలో ప్రభాస్ సలార్ సినిమా విడుదలవుతోంది. అది కనుక బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతి సినిమాలకు టెన్షనే. ఎందుకంటే సంక్రాంతి బరి వరకు అది థియేటర్లలో వుంటుంది. సంక్రాంతి సీజన్లలో కొన్ని థియేటర్లు అయినా దానికీ వుండాలి.

మొత్తం మీద ఈ సంక్రాంతి టాలీవుడ్ వరకు టెన్షన్.. టెన్షన్ నే. మాంచి రంజుగా వుండబోతోంది.