అమలాపురం లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇక్కడి నుంచి వైసీపీ తరపున చింతా అనురాధ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరపున మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన అమలాపురం నుంచి మరోసారి టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు. ఇదిలా వుండగా వైసీపీ తరపున కొత్త ముఖాలు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అమలాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేయడానికి ఓ ఐపీఎస్ అధికారి ఆసక్తి చూపుతున్నారు. సదరు ఐపీఎస్ అధికారిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆరోపణలు చేస్తూ వుంటారు. తనను అరెస్ట్ చేయడంతో పాటు ఆ రోజు రాత్రి చితక్కొట్టించారనేది రఘురామ ప్రధాన ఆరోపణ. తనను కొట్టించిన సదరు ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అనేక మందికి రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
రచయిత కూడా అయిన ఆ ఐపీఎస్ అధికారికి రాజకీయాలపై ఇటీవల కాలంలో మనసు మల్లింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ పోలీస్ ఉన్నతాధికారి సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ మనసెరిగి, ప్రత్యర్థులపై కేసులు, విచారణ తదితర అంశాల్లో చురుగ్గా పని చేశారు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎందుకోగానీ, సీఐడీలో కీలకంగా ఉన్న ఆ ఐపీఎస్ అధికారిని జగన్ ప్రభుత్వం మార్చేసింది.
ఇప్పుడాయన అప్రాధాన్య పోస్టులో ఉన్నారు. దీన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. అమలాపురంపై కనేసిన ఆ ఐపీఎస్ అధికారి… క్షేత్రస్థాయిలో వైసీపీపై ఎలా వుంది? అలాగే తాను బరిలో వుంటే ఫలితం ఎట్లా వుంటుందనే కోణంలో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నారని తెలిసింది. తన డిపార్ట్‌మెంట్‌లోని పది మంది ఉద్యోగులతో సెలవు పెట్టించి మరీ సర్వే చేయిస్తున్నారని సమాచారం.
అమలాపురంలో తన అభ్యర్థిత్వంపై పాజిటివ్ ఉందని నివేదికలొస్తే… స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైసీపీ తరపున రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ప్రజాదరణతో పాటు వైఎస్ జగన్ ఆశీస్సులుంటేనే రాజకీయాల్లోకి రావాలనేది ఆయన ఉద్దేశం. మరి వైఎస్ జగన్ మనసులో ఏముందో తెలియాల్సి వుంది. ప్రస్తుతానికైతే సదరు ఐపీఎస్ అధికారిపై సీఎం సానుకూలంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.