కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీగా టీడీపీకి గుర్తింపు వుంది. అలాంటి బద్ధ వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో పాలునీళ్లులా కలిసిపోవడం చర్చనీయాంశమైంది. 1982లో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం చెలాయిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తరచూ ముఖ్యమంత్రులను మారుస్తూ, అరాచక పాలన సాగిస్తుండడంతో ఏపీ సమాజం విసిగిపోయి వుండింది.
సరిగ్గా ఆ సమయంలోనే టీడీపీని స్థాపించి, ప్రజల్లో వ్యతిరేకతను దివంగత ఎన్టీఆర్ సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్, టీడీపీ మధ్య అధికారం కోసం వార్ జరిగింది. ఈ వార్లో అటు, ఇటు వైపు ప్రాణాలు కోల్పోయారు. ఇది గతం.
వర్తమానంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విభజన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను భారీగా దెబ్బతీసింది. ఏపీ విభజనతో తెలంగాణలో టీడీపీ, ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో బద్ధ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ శ్రేయోభిలాషిగా టీడీపీ మారడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ ఆకాంక్షిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్కు అన్ని విధాలా టీడీపీ అండగా నిలుస్తోంది. చివరికి తెలంగాణలో ఎన్నికల బరి నుంచి కూడా టీడీపీ తప్పుకుని కాంగ్రెస్కు తన ఓట్లను బదిలీ చేయడానికి నిర్ణయించింది.
ఈ పరంపరలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్కు టీడీపీ మరింత దగ్గరవుతోంది. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీడీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. తుమ్మల వెంట టీడీపీ శ్రేణులన్నీ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో అదే జిల్లా మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు టీడీపీ అండగా నిలవడం విశేషం. ఇవాళ ఎర్రుపాలెంలో ప్రచారం నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క వెంట టీడీపీ నాయకులంతా ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. భట్టి విక్రమార్క కాంగ్రెస్తో పాటు టీడీపీకి చెందిన పసుపు కండువా కూడా మెడలో వేసుకుని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్తో పాటు తమకు సీఎం కేసీఆర్ ఉమ్మడి శత్రువుగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు వారు చెప్పారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువలో వుందన్నారు.