తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు తీవ్రంగా వుంది. హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తుండడంతో పోటీదారులు కూడా ఎక్కువయ్యారు. దీంతో కొన్నిచోట్ల టికెట్ దక్కని నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 11 చోట్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాళ్టితో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. రెబల్ అభ్యర్థులు బరిలో వుంటే కాంగ్రెస్‌కే నష్టమని భావించిన అధిష్టానం, వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించేందుకు కొందరిని రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి సూర్యాపేటకు వెళ్లారు.
సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి ఆశించారు. అయితే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో పటేల్ రమేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీటిపర్యంతం కావడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నిలిచారు.
బుజ్జగించడానికి వెళ్లిన రోహిత్ చౌదరి, మల్లు రవిలను చూడగానే పటేల్ రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ దూతలను పటేల్ అనుచరులు అడ్డుకున్నారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికి రెండు దఫాలుగా టికెట్ ఇస్తామని చెప్పి, ఎన్నికలు వచ్చేసరికి మోసగిస్తున్నారని వాళ్ల వద్ద పటేల్ రమేశ్‌రెడ్డి వాపోయారు.
పోటీ నుంచి తప్పుకోవాలని, అధికారం కాంగ్రెస్‌దే అని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని నచ్చ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి విరమించేది లేదని కాంగ్రెస్ దూతలకు పటేల్ రమేశ్‌రెడ్డి తేల్చి చెప్పారు. పోటీపై పునరాలోచన చేయాలని పటేల్‌కు చివరిసారిగా నచ్చ చెప్పారు. అయితే రెండో ఆలోచనే లేదని పటేల్ స్పష్టం చేసినట్టు సమాచారం.