చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకున్నంత సులువుగా క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయరనే మాటే నిజమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ సమావేశం రచ్చకు దారి తీసింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో రెండు పార్టీల ఇన్‌చార్జ్‌ల మధ్య మాటామాటా పెరిగి, చివరికి కొట్టుకునే వరకూ పరిస్థితి దిగజారింది.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, సీట్ల ప్రకటన, నియోజకవర్గాల కేటాయింపు వచ్చే సరికి, టీడీపీ-జనసేన మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చే సామాజిక వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో తీవ్రమైన వైరం వుంది. ఉప్పునిప్పులా ఆ రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా, ఇతరత్రా కూడా విడిపోయి ఉన్నాయి. అయితే పవన్‌కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రెండు సామాజిక వర్గాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆచరణకు వచ్చే సరికి సాధ్యం కావడం లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ ప్రకటించారు. పవన్ ప్రకటనపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొందరి జనసేనను వీడి మౌనంగానూ, మరికొందరు ప్రత్నామ్యాయ పార్టీలను ఎంచుకున్నారు. మరోవైపు రెండు పార్టీల మధ్య సమన్వయం చేసుకునేందుకు నియోజకవర్గాల వారీగా కొందరు నాయకులను జనసేనాని ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన మధ్య సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో పిఠాపురం సమావేశం రసాభాస అయ్యింది. జనసేనకు తూర్పు, పశ్చమ గోదావరి జిల్లాల్లో అంతోఇంతో బలం వుంది. ఆ రెండు జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా వుంది. దీంతో రానున్న ఎన్నికల్లో అక్కడే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు. అయితే నియోజకవర్గ నాయకత్వాల్ని వదులుకోడానికి జనసేన, టీడీపీ ఇన్‌చార్జ్‌లెవరూ సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని పిఠాపురం ఎపిసోడ్ నిరూపిస్తోంది.
పిఠాపురంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ మాట్లాడుతూ తమ హయాంలో నియోజకవర్గంలో భారీ అభివృద్ధి చేస్తామన్నారు. అయితే మీరెందుకు ఓడిపోయారని జనసేన ఇన్‌చార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నుంచి ప్రశ్న ఎదురైంది. ఈ దఫా తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. శ్రీనివాస్ మాటలు టీడీపీ ఇన్‌చార్జ్‌కు కోపం తెప్పించాయి.
తనను ఓడిపోయావనడాన్ని టీడీపీ ఇన్‌చార్జ్ జీర్ణించుకోలేకపోయారు. మీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోలేదా? అని నిలదీశారు. పిఠాపురంలో జనసేనకు కేవలం 35 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, తనకు 75 వేలు వచ్చాయని, మీ బతుకేందో తెలుస్తోందని విరుచుకుపడ్డారు. ఇలా రెండు పార్టీల ఇన్‌చార్జ్‌ల మధ్య వాగ్వాదం కాస్త…కుర్చీలతో కొట్టుకునే వరకూ వెళ్లింది. సమావేశం రచ్చ కావడంతో జనసేన బయటికెళ్లిపోయింది.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, రానున్న రోజుల్లో అసలు సినిమా వేరే లెవెల్‌లో వుంటుందని జనసేన నేతలు హెచ్చరిస్తు న్నారు. పవన్ అమాయకత్వాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకుంటామంటే కుదరదని, క్షేత్రస్థాయిలో శ్రేణులు పనిచేసే పరిస్థితి లేదని జనసేన నేతలు బాహాటంగానే హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బలమున్న తమకు కాదని, టీడీపీనే బరిలో వుండాలంటే ఎలా కుదురుతుందని జనసేన నేతలు నిలదీస్తున్నారు. టీడీపీ పన్నాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు హెచ్చరించడం గమనార్హం.