ఛత్తీస్‌గఢ్ మన పొరుగు రాష్ట్రమే అయినా దాని రాజకీయాలు మనం పెద్దగా పట్టించుకోము. అక్కడి నాయకులూ అంతగా తెలియరు. అజిత్ జోగి ఉండేటప్పుడు కాస్త హడావుడి ఉండేది. ఇప్పుడు అదీ లేదు. ఎన్నికల సమయం కాబట్టి దాని గురించి కొంత సమాచారం తెలుసుకుంటే ఫలితాలు వచ్చాక ‘ఓహో, ఇదా కారణం!’ అనుకోవచ్చు. నవంబరు 7న మొదటి విడత ఎన్నికలు జరిగి రమారమి 70% పోలింగు జరిగింది. రెండవ విడత పోలింగు 17న. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ 2000 నవంబరులో విడివడింది. అప్పటికి రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెసే అధికారంలో ఉంది. 2003లో అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి 15 ఏళ్ల పాటు బిజెపి ముఖ్యమంత్రులే ఉన్నారు. 2018 వచ్చేసరికి రెండిటిలోనూ బిజెపి ఓడిపోయి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెసు ప్రభుత్వం 15 నెలల్లోనే పడిపోయి 2005 నుంచి 2018 వరకు బిజెపి ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు.
కానీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం 2018లో కాంగ్రెసు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన బఘేల్ యింకా కొనసాగుతున్నాడు. మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ పదవి పోవడానికి కారణం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలోకి ఫిరాయించడం! బఘేల్ విషయంలో అలాటి ప్రమాదం రాలేదు. ఆరోగ్య మంత్రిగా ఉన్న సింగ్‌దేవ్ అప్పుడప్పుడు అసమ్మతి రాగం వినిపించాడు. మొదటి రెండున్నరేళ్లు మాత్రమే బఘేల్ సిఎంగా ఉండి, తనకు పదవి అప్పగించాలని ఒప్పందం కుదిరిందని వాదించాడు. అలాటిదేదీ లేదంటాడు బఘేల్. చివరకు కాంగ్రెసు అధిష్టానం కలగచేసుకుని ఐదు నెలల క్రితం సింగ్‌దేవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి యిప్పించింది. కానీ రాష్ట్ర అధ్యక్షుడు మర్కమ్‌కు బఘేల్‌కు యిప్పటికీ పడటం లేదు.
సింగ్‌దేవ్, సింధియా అంత బలమైన నాయకుడు కాకపోవడంతో పాటు బఘేల్ నిలదొక్కుకోవడానికి మరో కారణం ప్రభుత్వ సుస్థిరత. మధ్యప్రదేశ్‌లో 2018 ఎన్నికలలో మొత్తం 230 సీట్లలో కాంగ్రెసుకు, బిజెపి కంటె 5 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లలో 53 ఎక్కువ వచ్చాయి. వీటితో పాటే ఎన్నికలు జరిగిన రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లలో కాంగ్రెసుకు బిజెపి కంటె 27 ఎక్కువ వచ్చాయి. రాజేశ్ పైలట్ తిరుగుబాటు చేస్తానంటూనే ఉన్నాడు కానీ అశోక్ గెహ్‌లోత్ ఎలాగోలా మేనేజ్ చేస్తూ వచ్చాడు. బఘేల్‌కు యిలాటి చిక్కులు లేకపోవడం చేత ప్రభుత్వం పనితీరుపై దృష్టి పెట్టగలిగాడు. అయినా బిజెపి గట్టి పోటీయే యిస్తోంది.
ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కాంగ్రెసు, బిజెపిల మధ్యే ముఖాముఖీ పోటీ ఉంది. 2003లో బిజెపి 39% ఓట్లతో 50 సీట్లు తెచ్చుకుంటే, కాంగ్రెసు 38% ఓట్లతో 37 సీట్లు తెచ్చుకుంది. 2008లో బిజెపి 40% ఓట్లతో 50 సీట్లు తెచ్చుకుంటే, కాంగ్రెసు 39% ఓట్లతో 38 సీట్లు తెచ్చుకుంది. 2013లో బిజెపి 41% ఓట్లతో 49 సీట్లు తెచ్చుకుంటే, కాంగ్రెసు 40.3% ఓట్లతో 39 తెచ్చుకుంది. ఒక్క % ఓట్ల తేడా వచ్చిన 10-12 సీట్ల తేడా వచ్చేస్తోంది. 2018 వచ్చేసరికి యిద్దరి మధ్య తేడా 10% అయిపోయింది. బిజెపి యీసారి 33% ఓట్లతో 15 తెచ్చుకుంటే, కాంగ్రెసు 43%తో 68 తెచ్చుకుంది. 2019 లోకసభకు వచ్చేసరికి యీ 10% తేడా రివర్స్ అయిపోయింది. బిజెపి 51% ఓట్లతో 9 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెసు 41%తో 2 సీట్లు తెచ్చుకుంది.
మోదీ హవా పార్లమెంటు ఎన్నికలలో మాత్రమే పని చేస్తున్నా, అసెంబ్లీ ఎన్నికలకు కూడా దాన్ని వాడుకుందామని బిజెపి ప్రయత్నం. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. రమణ్ సింగ్‌ను చూపటం లేదు. నిజానికి రమణ్ సింగ్‌కు చాలా మంచి పేరే ఉండేది. కానీ 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో అతని ప్రతిష్ఠ మసకబారింది. బిజెపి ప్రస్తుతం బిసి మంత్రం పఠిస్తోంది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బిసిను ముఖ్యమంత్రిగా చేస్తానంటోంది. అగ్రకులాల ఓట్లు 7-8% మాత్రమే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఒబిసి ఓట్లపై కన్నేసి, రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి, ప్రధాన ప్రతిపక్ష పదవి రెండూ బిసిలకే యిచ్చింది. 15 ఏళ్లు సిఎంగా చేసిన బిజెపి ప్రముఖ నాయకుడు రమణ్ సింగ్ బిసి కాదు, ఠాకూర్! అందుకని కాబోలు అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపటం లేదు.
రాష్ట్ర జనాభాలో గిరిజనులు 32% మంది ఉన్నారు. సర్వ ఆదివాసీ సమాజ్ అనే సంస్థ మాజీ కాంగ్రెసు నేత అరవింద్ నేతం సారథ్యంలో హమారా రాజ్ పేరుతో ఒక పార్టీ పెట్టింది. దానితో పాటు గోండ్వానా గణతంత్ర పార్టీ కూడా పోటీలో ఉంది. అవి కొన్ని ఓట్లు చీల్చవచ్చు. బిజెపి గిరిజన నాయకుడు నంద కుమార్ యీ మధ్య కాంగ్రెసుకు ఫిరాయించాడు. షెడ్యూల్ కులాలకు చెందిన సత్నామీ కులస్తులు రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటారు. కాంగ్రెసుకు మద్దతిస్తూ వచ్చారు. అజిత్ జోగి పార్టీలోంచి బయటకు వెళ్లాక చీలిక వచ్చింది. అతను పోయాక కొడుకు నేతృత్వం లోని పార్టీకి, బియస్పీకి కలిపి 2018లో 12% ఓట్లు, 7 సీట్లు వచ్చాయి. ఈ ఐదేళ్లలో అవి బలహీనపడ్డాయి. సత్నామీల గురువుల్లో ఒకరి కొడుక్కి కాంగ్రెసు మంత్రి పదవి యిచ్చింది. అందువలన వారి మద్దతు పొందవచ్చని దాని ఆశ. మరో గురువును బిజెపి దువ్వుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో నగర ప్రాంతాలు అతి తక్కువ. గ్రామాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువ. అందుకని వారిని ఆకర్షించే పథకాలకే పెద్ద పీట. బఘేల్ రైతులపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. 2018 ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు రైతుల ఋణమాఫీ చేశాడు. 2018 నుంచి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజనాను అమల్లోకి తెచ్చాడు. దాని ప్రకారం ఎకరానికి 15 (మళ్లీ గెలిస్తే 20 అంటున్నాడు) క్వింటాళ్ల ధాన్యం సేకరించి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకి రూ.500-600 యిస్తున్నాడు. దీన్ని నాలుగు విడతల్లో యిస్తున్నాడు. ఈ ఖరీఫ్‌లో కేంద్రం ప్రకటించిన ధర రూ.2040 కాగా, బఘేల్ రూ.2640 చొ.న రైతుకి చెల్లిస్తున్నాడు. అలా ఎకరానికి రూ.9000 రైతుకి అదనంగా లభిస్తోంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇలా సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ద్వారా విక్రయిస్తోంది. వరి పండించని రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున చెల్లిస్తున్నారు. కానీ యీ బోనస్ విడుదల ఆలస్యమౌతోందని రైతులకు కోపం కూడా ఉంది.
పార్టీలతో ప్రమేయం లేకుండా ఈ పథకాన్ని అందరికీ వర్తింప చేయడం వలన 26 లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు కలుగుతోంది. అంటే కుటుంబానికి నలుగురుంటే రమారమి కోటి మంది అనుకోవచ్చు. మొత్తం ఓటర్లు 2 కోట్లు కాబట్టి దీని ద్వారా సగం మంది కవర్ అయిపోయారనవచ్చు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో యిలాటి పథకం యింతకంటె తక్కువ మొత్తంతో, చిన్న, మధ్యస్త రైతులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం చిన్నా, పెద్దా అందరు రైతులకూ అమలు చేస్తున్నారు. 2013 ఎన్నికల వేళ బిజెపి క్వింటాల్ వరికి రూ.300 బోనస్ యిస్తామని హామీ యిచ్చి అధికారంలోకి వచ్చింది. రెండేళ్లు చెల్లించి తర్వాత కుదరదంటూ మానేసింది. 2018లో అది వాళ్లకు దెబ్బ కొట్టింది. అందుకే కాంగ్రెసు దీన్ని కచ్చితంగా అమలు చేస్తోంది.
దీని వెనక్కాల ఒక రాజకీయ వ్యూహం ఉంది. మొత్తం 90 నియోజకవర్గాల్లో 65 మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయి. అక్కడ అన్నీ పెద్ద కమతాలే. భూస్వాములను దావూలంటారు. దావూలలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కులాల వారితో పాటు కూర్మి, యాదవ, సాహూ వంటి బిసి కులాల వారు కూడా ఉన్నారు. వాళ్లు చుట్టూ ఉన్న పేదలకు కూలీ పనులు యిప్పించడంతో పాటు, అప్పులు కూడా యిస్తూంటారు. ఆ ప్రాంతాల్లో వారి మాట చెల్లుతుంది. కాంగ్రెసు ప్రస్తుత ముఖ్యమంత్రి బఘేల్ స్వయంగా బిసి. దానికి తోడు కూర్మి, యాదవ్, మరార్, అగరియా, పటేల్‌లతో కాంగ్రెసు బిసి కూటమి ఏర్పాటు చేస్తోంది. బిసిల్లో పెద్ద గ్రూపైన సాహూలను యీ పథకం ద్వారా బఘేల్ మంచి చేసుకున్నాడు. అయితే బిజెపి యిప్పుడు సాహూలపై కన్నేసింది. అరుణ్ సాహూ అనే అతన్ని గత ఏడాది రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. బఘేల్ బిహార్ తరహాలో కులగణన చేస్తానని హామీ యిస్తున్నాడు. బిజెపి ఆ మాట అనలేక పోతోంది. కులగణన చేస్తే తమకు రిజర్వేషన్ల శాతం పెరుగుతుందని బిసిల ఆశ. రెండు పార్టీలు చెరో 30 సీట్లు, అనగా మూడో వంతు బిసిలకు యిచ్చాయి.
పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెసు 20కు పైగా స్థానాల్లో బలహీనంగా ఉందంటున్నారు. రోడ్ల పరిస్థితి బాగులేక పోవడం, రాష్ట్రం అప్పులు పెరగడం, బఘేల్‌కు అత్మీయులైన ఐఏఎస్ అధికారుల యిళ్లల్లో క్యాష్ దొరకడాలు, ఓ యిద్దరు ఐఏఎస్‌లు, కాంగ్రెసు నాయుకుడు అన్వర్ దేబర్ జైలుకి వెళ్లడాలు యివన్నీ పట్టణ ఓటరును ప్రభావితం చేయవచ్చు. కాంగ్రెసు తన 71 ఎమ్మెల్యేలలో 30% మందికి అంటే 22 మందికి టిక్కెట్లివ్వలేదు. వారిలో యిద్దరి కొడుకులకు యిచ్చింది. బిజెపి తన 13 మంది ఎమ్మెల్యేలలో యిద్దరికి యివ్వలేదు.
2018 ఎన్నికలలో కాంగ్రెసు మద్యనిషేధం విధిస్తానని హామీ యిచ్చింది. బఘేల్ అధికారంలోకి వచ్చాక దానివలన కల్తీ మద్యం అమ్మకాలు పెరుగుతాయనే కారణం చూపి మానేశాడు. బిజెపి అది ఎత్తి చూపితే, ‘మీరు మాత్రం మీ 15 ఏళ్ల పాలనలో విధించారా? మోదీ గారికి చెప్పి దేశమంతా నిషేధించి, పొరుగు రాష్ట్రాల నుంచి రానీయకుండా చేయండి’ అని జవాబిచ్చాడు. మద్యనిషేధం ఎప్పణ్నుంచో ఉన్న గుజరాత్‌ను తప్పిస్తే, బిహార్‌లో నీతీశ్ ఒక్కడికీ తప్ప మరో రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేసే చిత్తశుద్ధి ఏ పార్టీకీ లేదు. ఎన్నికల వాగ్దానాల్లో దశలవారీ మద్యనిషేధం అనడం, తర్వాత కుదరలే దనడం పరిపాటి అయింది.
గ్రామీణాభివృద్ధి కోసం ‘‘నర్వా, గురవా, ఘూర్వా, బాడీ’’ అనే స్కీము కింద నీటి వనరులను పెంపొందించడం, పెంపుడు జంతువులను సంరక్షించడం, కంపోస్టును మార్కెట్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడం జరుగుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి, గోమూత్రాన్ని, గోమయాన్ని సేకరించి, వాటితో పెయింట్లు, అగరువత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. భూవసతి లేని కూలీలకు ‘న్యాయ్ స్కీమ్’ కింద ఏడాదికి రూ.6 వేలు యిస్తున్నారు. వీటన్నిటితో పాటు రెలిజియస్ టూరిజం కింది హిందూ పవిత్ర స్థలాలను అభివృద్ధి పరచడం, రామాయణ పఠనాలను, రామలీలా పోటీలను గ్రామగ్రామాన నిర్వహించడం యిలాటివి చేస్తున్నారు. రామ వన గమనం పథం పేర వనవాసంలో ఉండగా రాముడు నడయాడిన ప్రదేశాలను తీర్థయాత్రా స్థలాలుగా ఏర్పాటు చేస్తామని 2018 ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ కాంగ్రెసు మానిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 9 స్థలాలను యిలా అభివృద్ధి చేశారు.
‘పేదల యిళ్లు నిర్మించడానికి కేంద్రం పిఎం ఆవాస్ యోజనా కింద మాకు సాయం చేయకపోయినా సొంతంగా యిళ్లు కట్టించాం’ అని చెప్పుకున్న బఘేల్ యిప్పుడ మానిఫెస్టోలో 17.5 లక్షల యిళ్లు కట్టిస్తానంటున్నాడు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలు సీట్లు తగ్గినా కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తుందంటున్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి బిజెపి అనేక మార్గాలు వెతుకుతోంది. రాష్ట్ర శాఖ డిమాండుకు తల వొగ్గి, తాము అధికారంలోకి వస్తే వరి బోనస్‌ను క్వింటాల్‌కు రూ. 3100 యిస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో చాలా పాప్యులర్ అయిన లాడ్లీ బహ్‌నా యోజనాలాటి మహతారీ యోజనా పేరు మీద వివాహిత మహిళకు ఏడాదికి రూ. 12 వేలు యిస్తామని ప్రకటించింది.
దానికి తోడు చిన్న పార్టీలను ఎగదోసి కాంగ్రెసు ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు సాధారణంగా కాంగ్రెసుకు వెళుతూంటాయి కాబట్టి, వాటిని చీల్చడానికి హమారా రాజ్ పార్టీని ప్రోత్సహించి జనరల్ సీట్లలో కూడా అభ్యర్థులను నిలబెట్టించిందని అంటున్నారు. ఆప్ పార్టీ ఎలాగూ రంగంలో ఉంది కాబట్టి బిజెపి వ్యతిరేక ఓట్లను చీలడం తథ్యం. పైగా వారికి కాంగ్రెసుపై ఏ ప్రేమా లేదు. వీటితో బాటు అవినీనీతి ఆరోపణలు, హిందూత్వ ఎజెండా ఎలాగూ ఉన్నాయి. కాంగ్రెసు హయాంలో మతమార్పిడుల జోరు పెరిగిందంటూ బిజెపి ఆరోపిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బజరంగ బళి నినాదంలా యీ ఎన్నికలలో బిజెపి ‘హర హర మహాదేవ’ నినాదం ఎత్తుకుంది. దీనికి ఓ నేపథ్యం ఉంది.
యుఎఇకి చెందిన మహాదేవ్ అనే బెట్టింగు యాప్ ఉంది. దాని నిర్వాహకులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే. అది యిప్పటికే వివాదంలో ఉంది. సరిగ్గా మొదటి విడత ఎన్నికలు నాలుగు రోజులున్నాయనగా నవంబరు 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బఘేల్‌కు యీ బెట్టింగు సంస్థ నుంచి రూ.508 కోట్ల ముడుపులు ముట్టాయని ప్రకటన చేసింది. ‘నిన్ననే రాయ్‌పూర్‌లోలో అసీమ్ దాస్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. అతను క్యాష్ కొరియర్. అతని కారులో, నివాసంలో రూ. 5.39 కోట్ల నగదు దొరికింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్లు అతని ద్వారా బఘేల్‌కు యీ డబ్బు పంపిస్తున్నట్లు అతను విచారణలో అంగీకరించాడు. అతని సెల్‌ను శుభం సోనీ అనే యాప్ ఉన్నతోద్యోగికి పంపగా యిప్పటికే యాప్ వాళ్లు బఘేల్‌కి రూ.508 కోట్లు పంపినట్లు తెలిసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలి.’ అని ప్రకటించింది. ఆ యాప్‌ను బ్లాక్ చేయించింది.
దీనిపై కాంగ్రెసు వివరణ యిస్తూ ‘‘ఈ మహదేవ్ యాప్‌పై ఏడాదిన్నరగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఇప్పటికే 70 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది. 450 మందిని అరెస్టు చేసింది. ప్రమోటర్లు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారి గురించి కేంద్రానికి సమాచారం యిచ్చాం. దాన్ని నిషేధించాలని బఘేల్ ఆగస్టు 24న కేంద్రాన్ని డిమాండు చేశారు కూడా. అయినా వారు యిన్నాళ్లూ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలలో ఓటమి భయంతో ఈడీ, ఐటీల సాయంతో పోరాటంలోకి దిగారు. ఈడీ ప్రకటన యిచ్చింది. అదే సమయంలో బిజెపి శుభం సోనీ వీడియోలో విడుదల చేసింది. ఆ వీడియోలో శుభం సోనీ తనే ఆ కంపెనీకి అసలైన పెట్టుబడిదారుణ్నని చెప్పుకుంటూ, బఘేల్‌కు రూ.508 కోట్లు యిచ్చినట్లు చెప్పాడు. ఆ యాప్ పెట్టుబడిదారులు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్ అని అందరికీ తెలుసు.’’ అంది.
ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం బిజెపికి అలవాటుగా మారింది. గతంలో సాక్షాత్తూ మోదీ మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ తనని హత్య చేయించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ వాటి ఊసు ఉండదు. దీని కథా అదే అవుతుందేమో తెలియదు. ఈ లోపున మోదీ ‘కాంగ్రెసు వాళ్లు మహాదేవుణ్ని కూడా వదల్లేదు’ అంటూ బాణాలు వేశారు. బిజెపి వారు పైన చెప్పినట్లుగా హరహర మహాదేవ స్లోగన్ వినిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరు గెలిచినా యీ విచారణను కడదాకా తీసుకుని వస్తారని ఆశిద్దాం.
– (ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)