దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ పట్టుకలిగిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే కన్నడీగులు కూడా ఏకపక్షంగానో, స్పష్టమైన మెజారిటీని ఇచ్చి బీజేపీకి పట్టం గట్టడం లేదు. గత పర్యాయం మెజారిటీకి కాస్త దూరంలోనే నిలిచింది బీజేపీ. హంగ్ తరహా పరిస్థితుల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ కమలం పార్టీ ఆ ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్పను సీఎంగా చేసింది. ఆ తర్వాత ఆయనను దించి బసరాజ బొమ్మైను సీఎంగా చేసింది.
ఈయన సీఎం అయిన దగ్గర నుంచి హిందుత్వ విధానాలను చట్టాలుగా చేసి పట్టునిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బొమ్మైని బలహీన సీఎంగానే చూస్తున్నారంతా! అధిష్టానం ఉన్నట్టుండి సీఎంగా చేస్తే అదెవరికైనా దక్షిణాదిన బలహీన సీఎం అనే పేరే వస్తుంది. దీనికి బొమ్మై మినహాయింపు కాదు. బొమ్మై స్థానంలో మరో నేతను సీఎంగా చేయాలంటూ ఇప్పటికే కర్ణాటక బీజేపీలో బలమైన నినాదం ఉంది. బీజేపీ అధిష్టానం కూడా అలా అనుకున్నా.. సరైన ప్రత్యామ్నాయం లేదు కమలం పార్టీకి!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రం కర్ణాటక. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలే అనే టాక్ గట్టిగా ఉంది. కాంగ్రెస్ సవ్యంగా పని చేసుకుంటే అధికారం ఆ పార్టీకి సొంతం అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ లో అంత్ఃకలహాలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఈ కలహాలే జేడీఎస్- కాంగ్రెస్ ల సంకీర్ణ కూటమిని కూల్చేశాయి. కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను సిద్ధరామయ్యే బయటకు పంపించాడనే ప్రచారమూ ఉంది. అలాంటిది రేపు మళ్లీ అవకాశం దక్కుతుందంటే కాంగ్రెస్ నేతల మధ్యన గొడవలు పతాక స్థాయికి చేరడంలో ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ కథ అలా ఉంటే, కమలం పార్టీలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. బీజేపీకి ఎదురుగాలి అనే విశ్లేషణలకు తోడు.. బొమ్మైని మారుస్తారనే ప్రచారం, యడియూరప్ప క్రియాశీలంగా లేకపోవడం, ఒకవేళ యడియూరప్ప యాక్టివ్ గా ప్రచారం చేసే పరిస్థితి ఉన్నా.. అలిగి ఉన్న ఆయన పార్టీ కోసం ఎంత వరకూ శ్రద్ధ చూపుతారు ఈ వయసులో అనేదీ సందేహమే. తన వారసుడిని పార్టీ ప్రమోట్ చేసేట్టుగా అయితే ఆయన ప్రచారంలోకి దిగవచ్చు. బొమ్మై ఒంటి చేత్తో లాక్కొంచేంత సీన్ అయితే లేదు.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ కూడా బీజేపీ పై నమ్మకం సడలుతుండటానికి ఒక నిదర్శనమే. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా గాలి సోదరులు, వారి అనుచరుడు శ్రీరాములుకు పెద్ద ప్రాధాన్యత దక్కడమూ లేదు. ఇలాంటి నేపథ్యంలో వీరు వేరే దారి చూసుకోవడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు.