దాదాపు రెండు దశాబ్దాల క్రితం తన తొలి టెస్టును ఇండియాతోనే ఆడింది బంగ్లాదేశ్. ఈ దేశ క్రికెట్ జట్టుకు తొలిసారి టెస్టు హోదా దక్కాకా.. మొదటి మ్యాచ్ ఆడటానికి టీమిండియా బంగ్లాదేశ్ వెళ్లింది. కెప్టెన్ గా సౌరవ్ గంగూలీకి తొలి తొలి రోజులవి. బంగ్లా వెళ్లి ఒక టెస్టు మ్యాచ్ ఆడిన భారత్ ఆ మ్యాచ్ లో గెలిచి సీరిస్ ను దక్కించుకుంది.
ఆ తర్వాత ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్యన మరో పన్నెండు టెస్టు మ్యాచ్ లు జరిగాయి ఇప్పటి వరకూ. ప్రతి సారీ సీరిస్ ను భారత్ దక్కించుకుంది. తాజాగా 2-0తో బంగ్లాదేశ్ పై టెస్టు సీరిస్ ను నెగ్గింది టీమిండియా. రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు బంగ్లాపై భారత్ బాగా కష్టపడే నెగ్గింది. ఒక దశలో బంగ్లా బౌలర్లు ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేస్తారేమోననిపించారు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్ ను గడగడలాడించారు.
మూడో రోజు చివరి సెషన్ లో మూడు వికెట్లను పడగొట్టిన బంగ్లా బౌలర్లు, నాలుగో రోజు ఆరంభంలో అదరగొట్టారు. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 80 పరుగుల స్థాయి లీడ్ టీమిండియాకు లభించకపోయి ఉంటే.. ఈ మ్యాచ్ లో భారత్ ది బేళ పరిస్థితే అయ్యేది. చివరకు మూడు వికెట్ల తేడాతో టీమిండియాకు విజయం లభించింది. 145 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా పెవిలియన్ కు చేరారు. గిల్, పుజారా, కొహ్లీ, రాహుల్, పంత్.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని బంగ్లా బౌలర్లు పెవిలియన్ కు చేర్చారు.
అక్షర్ పటేల్, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ లు మాత్రమే ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో కీలక పాత్ర పోషించారు. ఎలాగోలా పరువు నిలిపారు. బంగ్లా చేతిలో తొలి టెస్టు ఓటమిని తప్పించారు.
ఇరవయ్యేల కిందట టెస్టు హోదాను పొందిన బంగ్లాదేశ్ ఇప్పటికి సొంతదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో బలమైన శక్తిగా నిలుస్తోంది. గత కొన్నేళ్లలో బంగ్లాదేశ్ ఏ జట్టు మీద కూడా స్వదేశంలో వన్డే సీరిస్ ను కోల్పోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీమిండియా కూడా గత రెండు పర్యటనల్లోనూ వన్డే సీరిస్ లను సాధించలేకపోయింది. వన్డేల వరకూ బంగ్లా స్వదేశంలో బేబీ హోదా నుంచి బలమైన జట్టు హోదాకు ప్రమోషన్ పొందింది. ఇక ఇంగ్లండ్ పై స్వదేశంలో టెస్టును కూడా గెలిచింది. వెస్టీండీస్, జింబాబ్వేలపై అయితే స్వీప్ చేసేస్తోంది. ఇండియాపై విజయం కోసం మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితుల్లోనే ఉంది.
అంతర్జాతీయ వేదికలపై బంగ్లా ప్లేయర్లు ఇప్పుడిప్పుడు చెప్పుకోదగిన స్థాయిలో మెరుస్తున్నారు. తమదైన రోజున వన్డేలు, టీ20ల్లోనే కాదు టెస్టుల్లో కూడా బంగ్లా బలాన్ని చాటుతోంది. ఇది వరకటి పర్యటనల్లో బంగ్లాపై అతి సునాయాసంగా టెస్టులను నెగ్గిన టీమిండియా ఇప్పుడు విజయం కోసం చాలా కష్టపడాల్సి రావడమే ఇందుకు నిదర్శనం. ఇక బంగ్లా బేబీ కాకపోవచ్చు!