చంద్రబాబు మూడు రోజుల ఉత్తరాంధ్రా టూర్ చేశారు. జనాలు బాగా వచ్చారని ఉత్సాహపడ్డారు. ఇక తనకు ధైర్యం వచ్చేసిందని చెప్పుకున్నారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం తానే అని కూడా చంద్రబాబు ధీమా పడుతున్నారు. తన కళ్ళు తిరిగిపోయే స్థాయిలో జనం ఎక్కడ చూసినా వెల్లువలా వచ్చారని బాబు అంటూ తనకు తాను బాగానే ధైర్యం చెప్పుకున్నారు.
ఉత్తరాంధ్రా టూర్ లో చంద్రబాబు జగన్ పాలన పోవాలి తన పాలన రావాలని అడుగడుగునా జనాలకు పిలుపు ఇచ్చారు. బీసీలకు జగన్ ఏమీ చేయలేదని విమర్శించారు. దానికి గట్టి కౌంటరే వైసీపీ నుంచి వస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఉత్తరాంద్ర బీసీలకు ఫలానాది చేశాను అని గట్టిగా చెప్పగలవా బాబూ అని నిలదీశారు.
నీ మంత్రివర్గంలో అచ్చెన్నాయుడు కళా వెంకటరరావు బీసీ మంత్రులుగా ఉన్నారు. జగన్ పాలనలో తాను మరికొందరు మంత్రులుగా ఉన్నామని, బీసీలకు ప్రత్యేక అధికారాలు నీవు ఏమైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. అచ్చెన్నకు కళాకు మంత్రులుగా సీఎం కంటే ఎక్కువ పవర్స్ ఏమైనా నాడు ఇచ్చావా అంటూ బాబుని గుచ్చి గుచ్చి అడిగారు.
మరి తమకు లేనిదేంటి వారికి ఉన్నదేంటి, ఈ అవసరం లేని కబుర్లు చెబుతూ బీసీలకు తానే పెద్ద చేశామని చెప్పుకోవడమేంటని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పదవి క్యాబినేట్ ర్యాంక్ హోదాతో ఒక రాజుకు ఇచ్చినపుడు ఉత్తరాంధ్రాలో బీసీలు ఎవరూ బాబుకు కనిపించలేదా అని కరెక్ట్ పాయింట్ నే బొత్స పట్టుకుని బాబు మీద సంధించారు.
బీసీ మంత్రులుగా తమ అధికారాలను తాము సవ్యంగా సజావుగా ఉపయోగిస్తున్నామని ఒకరు ఏదో చెబితే చేయడానికి తాము చిన్న పిల్లలమా అని బొత్స బాబుని ప్రశ్నించారు. బీసీలను ఈ విధంగా బాబు అవమానిస్తున్నారు అన్నారు. ఉత్తరాంధ్రా అభివృద్ధి విషయమే తీసుకుంటే తోటపల్లి బ్యారేజ్ సహా అనేక సాగునీటి ప్రాజెక్టులకు ఏమీ చేయని చంద్రబాబు ఇపుడు మొసలి కన్నీరే కారుస్తున్నారు అన్నారు.
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పొర్టు ని కూడా కట్టలేని పరిస్థితిలో అయిదేళ్ల పాలన చేసి ఇపుడు ఉత్తరాంధ్రాకు అంతా తామే చేస్తున్నట్లుగా బాబు ప్రచారం చేసుకుంటున్నారని అన్న్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అయితే అభివృద్ధి విషయంలో చంద్రబాబు తమతో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. ఎంతసేపూ తన గొప్పలు చెప్పుకుంటూ ఎదుటి పార్టీ మీద విమర్శలు చేయడమే తప్ప బాబు నిజానికి ఏం చేశారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
బీసీల ఓట్లు కావాలి, అభివృద్ధి పేరిట మాటలు చెప్పాలి ఇలా మూడు రోజుల టూర్ లో తానే అన్నీ అని చెప్పెసి తన పార్టీ గెలుపు కోసం తానే ధైర్యం తెచ్చుకుంటున్న చంద్రబాబు చెప్పాల్సిన నిజానికి జవాబులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.