ఇటీవల కమలాపురం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానికతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే తన రాష్ట్రం, ఇక్కడే తన నివాసం అని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ గడ్డపై మమకారం ఉందన్నారు. ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే తన కుటుంబం, ఇక్కడే రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే తన విధానమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు.
పనిలో పనిగా జగన్తో పాటు చంద్రబాబును కూడా ఆయన విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ లోటస్పాండ్, ఇప్పుడు చంద్రబాబు జూబ్లీహిల్స్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గెలిస్తేనే ఆంధ్రాలో వుంటారా? అని ఆయన నిలదీశారు. కుటుంబ పాలన దేశానికి పట్టిన చీడ అని జీవీఎల్ నరసింహారావు అన్నారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు.
ఏపీలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. దుష్ట పరిపాలనకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు. మూడున్నరేళ్లుగా ఓటు బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయన్నారు. ఆంధ్రలో బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ పాలన చేసి చూపిస్తామన్నారు. దేశ భక్తి కలిగిన బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో అధికారం వెలగబెడుతున్న ప్రజానీకానికి చేసిన మంచి ఏంటో వివరిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో టీడీపీతో కలిసి మూడున్నరేళ్ల పాటు ఏపీలో అధికారాన్ని పంచుకున్న బీజేపీ చేసిందేమిటో చెప్పకుండా, ఏపీలో అధికారం ఇవ్వాలని అభ్యర్థించడం గమనార్హం. టీడీపీతో కలిసి అధికారం చేశామనే విషయాన్ని మరిచిపోయి విమర్శించడం ఆ పార్టీకే చెల్లింది. చంద్రబాబుతో కలిసి అంటకాగుతున్నప్పుడు కుటుంబ పార్టీల గురించి గుర్తుకు రాలేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఏం చెబుతారో? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.