ముందుగా ప్రకటించేశాడు …!

ఏపీలో ఎన్నికలు జరిగేది 2024 లో. కానీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు, ఇతర పార్టీల్లో కూడా ఎన్నికల మూడ్ కనబడుతోంది. ఇక టీడీపీ సంగతి చెప్పక్కరలేదు. పార్టీ అధినేత రాష్ట్రమంతా చుట్టబెడుతున్నారు.…

ఏపీలో ఎన్నికలు జరిగేది 2024 లో. కానీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు, ఇతర పార్టీల్లో కూడా ఎన్నికల మూడ్ కనబడుతోంది. ఇక టీడీపీ సంగతి చెప్పక్కరలేదు. పార్టీ అధినేత రాష్ట్రమంతా చుట్టబెడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఖమ్మంలో కూడా ఈ మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన పాట్లు ఆయన పడుతున్నాడు. బీజేపీలో ఎలాంటి హడావిడి లేదు. జనసేన తాము కలిసి పోటీ చేస్తామంటున్నారు. కానీ ఆ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో తెలియడంలేదు. 

ఇన్ని పార్టీల మధ్య, ఇంతమంది నాయకుల మధ్య ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆయనే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వీవీ లక్ష్మీనారాయణ. కానీ ఆయన జేడీ లక్ష్మీనారాయణగానే అందరికీ సుపరిచితుడు. ఈయన గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే కదా. తరువాత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి నచ్చక పార్టీ నుంచి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు.

విశాఖ నుంచి పోటీ చేయటం ఖాయం చేసిన మాజీ జేడీ.. ఏ పార్టీ తరపునా పోటీ చేయటం లేదనేది స్పష్టం అవుతోంది. లక్ష్మీనారాయణ తొలి నుంచి తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీలో చేరుతానని చెప్పుకొచ్చారు. జనసేన నుంచి బయటకు వచ్చేయటంతో, టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. బీజేపీ వైపు చూసినా.. కేంద్ర నిర్ణయాల పైన ఆయన పోరాడుతుండటంతో సాధ్యపడదనేది స్పష్టం అయింది. తాజాగా జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ సభ్యునిగా జేడీ పోటీ చేస్తారని, అది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పైన రాజకీయంగా జరుగుతున్న ప్రచారానికి ముగింపు ఇచ్చేందుకే ఈ ప్రకటన వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలనేది ఫైనల్ నిర్ణయంగా ఉంటుందా..లేక, తన భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు ఏవైనా ముందుకొస్తే నిర్ణయంలో మార్పు ఉంటుందా అనేది మరో చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణదాఖలు చేసిన పిటీషన్ పైన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఏపీలో కొత్త పార్టీలు ఎంట్రీ ఇస్తున్న వేళ..జేడీ అందులో కీలక బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగుతోంది.