పోవ‌ల‌సిన టైమ్ వ‌స్తే…ఇలా నిష్క్ర‌మిస్తారేమో!

ప్ర‌ముఖ సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు ఆక‌స్మిత మృతిని టాలీవుడ్ జీర్ణించుకోలేక‌పోతోంది. ఇటీవ‌ల టాలీవుడ్ పెద్ద‌లు ఒక్కొక్క‌రుగా నిష్క్ర‌మిస్తుండ‌డం ఆ రంగానికి తీర‌ని లోటు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, రెండు రోజుల క్రితం స‌త్య‌నారాయ‌ణ‌,…

ప్ర‌ముఖ సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు ఆక‌స్మిత మృతిని టాలీవుడ్ జీర్ణించుకోలేక‌పోతోంది. ఇటీవ‌ల టాలీవుడ్ పెద్ద‌లు ఒక్కొక్క‌రుగా నిష్క్ర‌మిస్తుండ‌డం ఆ రంగానికి తీర‌ని లోటు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, రెండు రోజుల క్రితం స‌త్య‌నారాయ‌ణ‌, నేడు చ‌ల‌ప‌తిరావు మ‌న‌ల్ని వీడి మ‌రో ప్ర‌పంచానికి వెళ్లిపోయారు. అభిమానుల్ని, కుటుంబ స‌భ్యుల్ని, ఆప్తుల్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తారు. ఈ నేప‌థ్యంలో చ‌ల‌ప‌తిరావు మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

ట్విట‌ర్ వేదిక‌గా చ‌ల‌ప‌తిరావు కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. అలాగే చ‌ల‌ప‌తిరావు మృత దేహానికి ఆయ‌న నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. చ‌ల‌ప‌తిరావు త‌న‌కు మంచి మిత్రుడ‌న్నారు. చెన్నైలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌తో త‌న‌కు మంచి అనుబంధం వుండేద‌ని గుర్తు చేసుకున్నారు.
 
చ‌ల‌పతిరావు వేషాలు, మాట‌లు లేదా జోకులు, వ్య‌క్తిగ‌త అల‌వాట్ల‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్నారు. చాలా ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు వుండేవన్నారు. కాఫీ, టీ కూడా తాగేవాడు కాద‌న్నారు. ఎప్పుడూ సినిమా గురించే త‌పించేవార‌న్నారు. హెల్త్ విష‌యంలో ఎప్పుడూ నిర్ల‌క్ష్యం చేయ‌లేద‌న్నారు. పోవ‌ల‌సిన టైం వ‌స్తే… ఇలాగే నిష్క్ర‌మిస్తారేమో అని ఆయ‌న అన్నారు. చ‌ల‌ప‌తిరావు మ‌ర‌ణం త‌న‌ను క‌ల‌చివేసింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా చ‌ల‌ప‌తిరావు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కాంక్షించారు.