కర్నాటకలో బీజేపీకి గాలి జనార్ధన్‌రెడ్డి ఝలక్ ఇచ్చారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ పరిణామం బీజేపీకి కొంత వరకూ దెబ్బే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్నాటకతో పాటు తెలుగు సమాజానికి గాలి బ్రదర్స్ సుపరిచితులే. గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులు కరుణాకరరెడ్డి, సోమశేఖరరెడ్డి. వీళ్ల పేర్లు కూడా రాజకీయంగా, పారిశ్రామికంగా వినిపిస్తూ వుంటాయి.
1999లో మొదటిసారి గాలి జనార్ధన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. బళ్లారి నుంచి నుంచి సోనియాగాంధీ పోటీ చేసినప్పుడు ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సుష్మాస్వరాజ్ నిలిచారు. ఆమెకు గాలి జనార్ధన్‌రెడ్డి గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. దీంతో ఆయన పేరు మొదటిసారిగా బాగా వినిపించింది. ఆ తర్వాత 2001 లో బీజేపీ మొదటిసారి బళ్లారిలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపింది. అలాగే కర్నాటక రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా 2004లో బళ్లారి ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అలాగే 2005లో బీజేపీ మొదటిసారి బళ్లారి జిల్లా పరిషత్‌ను బీజేపీ దక్కించుకుంది. దీనికి గాలి జనార్ధన్‌రెడ్డి నాయకత్వమే కారణం.
2006లో గాలి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప మంత్రి వర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ఏళ్ల తరబడి జైల్లో గడిపారు. గాలి కేసును త్వరగా తేల్చాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా బీజేపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇవాళ బీజేపీతో సంబంధాలు తెంచుకుని, కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాలి నిర్ణయం రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.