నిజమే…చంద్రబాబు పిరికివాడు. ఈ విషయాన్ని తనే ఒప్పుకున్నారు. చాలా విషయాల్లో వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని చంద్రబాబు సమాజానికి భయపడుతుంటారు. బామ్మర్ది బాలయ్య ఓ కేసులో ఇరుక్కున్న సందర్భంలో… పరామర్శించడానికి చంద్రబాబు చాలా ఆలోచించారనే ప్రచారం వుంది. ఇదే బాబు మిత్రుడు, రాజకీయ ప్రత్యర్థి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి భయమనేది ఎరుగని నేతగా గుర్తింపు పొందారు.
హత్య కేసుల్లో నిందితులుగా జైలు జీవితం గడుపుతున్న వారిని పరామర్శించడానికి వైఎస్సార్ వెళ్లడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడీ భయాల గురించి చర్చ ఎందుకంటే… దాని తేనె తుట్టెను చంద్రబాబు కదపడమే కారణం. ముఖ్యమంత్రిగా తనకు, జగన్‌కు మధ్య తేడాను ఆయన చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలకు భయపడేవాడిని. ఇప్పుడు వాళ్లే జగన్‌కు భయపడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పింది అక్షరాల నూటికి నూరు పాళ్లు నిజం. ఉద్యోగులు అతి పెద్ద ఓటు బ్యాంక్. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు లేదా నిలబెట్టగలరనే ప్రచారం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నా ఉద్యోగులను సంతృప్తిపరచడం సాధ్యం కాదనే అభిప్రాయం వుంది.
ఉద్యోగుల వ్యతిరేకిగా చంద్రబాబు ముద్రపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడంలో ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొంత వరకూ మేలు చేసింది. అయితే కొత్త పీఆర్‌సీ, వేతనాలు ఇవ్వడంలో జాప్యం తదితర అంశాలు ఉద్యోగుల వ్యతిరేక సర్కార్‌గా జగన్ ప్రభుత్వం గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో పలు దఫాలు ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం అణిచివేసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ముఖ్యంగా ఉపాధ్యాయులను ప్రభుత్వం దూరం పెట్టింది. తమకు వ్యతిరేకంగా పని చేస్తారనే భయంతో వారిని ఎన్నికలకు విధులకు దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు తాను భయపడేవాడినని, కానీ జగన్‌కు వారు భయపడుతున్నారని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఉద్యోగుల మనసు చూరగొనడానికి చంద్రబాబు ఎక్కువ భయాన్ని నటిస్తున్నాడనే ప్రచారం లేకపోలేదు. ఈ దఫా జగన్ సర్కార్ ఉద్యోగుల వ్యతిరేకత నుంచి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.