క‌రోనా మ‌ర‌ణ మృదంగం

చైనాలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. చైనాలో మ‌ళ్లీ కరోనా మ‌హ‌మ్మారి వ్యాపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఇదే దేశంలో మొట్ట‌మొద‌ట‌గా మ‌హ‌మ్మారి త‌న రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లు పెట్టింది. అక్క‌డ మొద‌లైన…

చైనాలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. చైనాలో మ‌ళ్లీ కరోనా మ‌హ‌మ్మారి వ్యాపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఇదే దేశంలో మొట్ట‌మొద‌ట‌గా మ‌హ‌మ్మారి త‌న రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లు పెట్టింది. అక్క‌డ మొద‌లైన ఆ వైర‌స్ ఆగ‌డాలు విశ్వ వ్యాప్తమ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా పోయింద‌ని గ‌త ఏడాదిగా అంతా ఊపిరి పీల్చుకుంటున్న త‌రుణంలో… చైనా చేదు వార్త అందించింది.

మ‌ళ్లీ ఆ దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌నే వార్త‌లు యావ‌త్ ప్రపంచాన్ని వ‌ణికిస్తున్నాయి. అమెరికా, జ‌పాన్‌, బ్రెజిల్ త‌దిత‌ర దేశాల్లో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. క‌రోనా టెస్ట్‌లు, మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి అని చెబుతోంది. ఇదిలా వుండ‌గా నాలుగో వేవ్ క‌రోనా వైర‌స్‌తో ప్రాణాపాయం వుండ‌ద‌ని వైద్య నిపుణుల మాట‌లు ఊర‌ట క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ, వాస్త‌వాలు మాత్రం భ‌య‌పెడుతున్నాయి.

చైనాలో క‌రోనా దెబ్బ‌కు పెద్ద ఎత్తున మృత్యువాత ప‌డుతున్నార‌ని, అలాగే భారీ సంఖ్య‌లో ఆస్ప‌త్రిపాలవుతున్నార‌నే వార్త‌లు ప్ర‌పంచ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. చైనాలో క‌రోనా మృతుల‌తో శ్మ‌శాన వాటిక‌లు నిండిపోతున్న‌ట్టు చెబుతున్నారు. అలాగే ఆస్ప‌త్రుల్లో బెడ్ల కొర‌త ఉంద‌ని చెబుతున్నారు. గ‌తంలో కూడా చైనాలో ఇలాంటి ప‌రిస్థితులే… ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించాయి. నాలుగో వేవ్‌పై అజాగ్ర‌త్త‌గా ఉండ‌కూడ‌ద‌ని చైనా తాజా ప‌రిణామాలు హెచ్చ‌రిస్తున్నాయి.

క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌డ‌మే మ‌న ముందున్న ఏకైక ల‌క్ష్య‌మ‌ని చెప్పొచ్చు. ఒక్క సారి ఆ రాక్ష‌స వైర‌స్ బారిన ప‌డితే… ప‌రిణామాలు మ‌న చేతుల్లో ఉండ‌వ‌నేది క‌ఠిన వాస్త‌వం. రెండుమూడు ద‌ఫాలు వ్యాక్సినేష‌న్ వేయించుకున్న‌ప్ప‌టికీ, క‌నీస బాధ్య‌త‌గా జాగ్ర‌త్త‌గా వుండ‌డం అవ‌స‌రం. ఎందుకంటే మ‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌డం మ‌న బాధ్య‌త కాబ‌ట్టి.