దాదాపు మూడు సంవత్సరాలుగా మానవాళికి ముప్పుగా మారిన కరోనా వైరస్ గత ఏడాది కాలంగా విరామం ఇచ్చినట్టుగానే ఇచ్చి ఇప్పుడు మళ్లీ తనదైన రీతిలో స్పందిస్తున్నట్టుగా ఉంది. గత ఏడాది ఈ సమయంలోనే భారతదేశంలో ఒమిక్రాన్ రూపంలో కరోనా వేరియెంట్ వేగంగా వ్యాపించింది. అయితే అంతకు ముందు రెండు వేవ్ ల కరోనాతో పోలిస్తే మూడో వేవ్ లో కరోనా వేగంగా వ్యాపించినా, ఒమిక్రాన్ వేరియెంట్ తో హాస్పిటలైజ్ అయిన వారి సంఖ్య బాగా తక్కువ అని వైద్య పరిశోధకులు వివరించారు.
గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి సమయాల్లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. అయితే ముప్పు తక్కువ అని ఎక్కడిక్కడ నిర్ధారణ కూడా అయ్యింది. ఇలా కరోనా లైట్ వేరియెంట్ తో దేశ జనాభాలో మెజారిటీ మందికి సోకిందని, దీంతో కరోనాకు విరుగుడుగా చాలా మందిలో యాంటీ బాడీస్ కూడా పెంపొందాయని, అసింప్టమాటిక్ కేసులతో వ్యాధినిరోధకత పెంపొందనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపించాయి. అలా ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా భయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఆ ఊరట ఎక్కువ కాలం ఉండేలా లేదు. ఇప్పుడు మళ్లీ కరోనా భయాలు పెరుగుతున్నాయి. చైనాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా చైనా ఈ విషయాన్ని చెప్పడం లేదు. చైనా తీరు మొదటి నుంచి సందేహాస్పదమే కాబట్టి.. చైనా అధికారిక ప్రకటనలను నమ్మే వారి కన్నా.. అక్కడ నుంచి వస్తున్న అనధికారిక వార్తలనే ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
ఇక కరోనా గురించి మళ్లీ రకరకాల వార్తలు, విశ్లేషణలు, ఊహాగానాలకు మళ్లీ ఊపొస్తోంది. నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసే వారు ఆ పనిలో బిజీగా ఉన్నారు. వీరు ఎప్పుడూ ఈ పని చేస్తూనే ఉన్నారు. 2022 మార్చి సమయంలో కూడా.. మళ్లీ కరోనా విజృంభిస్తుందంటూ ప్రచారాలు చేశారు. అనేక టీవీ చానళ్లు కూడా ఈ వార్తలను ప్రచారంలో పెట్టాయి. వీరి లెక్కల ప్రకారం.. 2022 జూన్ సమయంలోనే కరోనా కేసులు భారీగా నమోదవ్వాలి. అయితే నాలుగో వేవ్ జూన్ లో అంటూ చెప్పిన ఊహాగానాలేవీ నిజం కాలేదు. జూన్ సాఫీగానే సాగిపోయింది. క్రమంగా కరోనా టెస్టులు చేయించే వారు కూడా కరువయ్యారు. ఇటీవలి కాలంలో అయితే వారం, పది రోజుల పాటు జ్వరాలు వచ్చినా.. వైరల్ ఫీవర్ అంటూ డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు కానీ, కరోనా టెస్టులు చేయించుకోమంటూ చెప్పడం లేదు. కొందరు మాత్రం జ్వరం అనగానే కరోనా టెస్టు ఒకటి చేయించేస్తూ వచ్చారు. వైద్యులే ఇంకెక్కడి కరోనా అంటూ పేషెంట్లతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా చైనా వ్యవహారంతో మళ్లీ పరిస్థితులు మారుతున్నాయి.
ఫ్రాన్స్ తుమ్మితే యూరప్ కు జలుబు చేస్తుందనేది ఒకప్పటి సామెత. అయితే ఇప్పుడు ఎక్కడ జనాలు తుమ్ముతున్నా మిగతా ప్రపంచం మాస్కులు వేసుకోక తప్పని పరిస్థితి. దీంతో గత వారం నుంచి జనాలు మాస్కులతో కనిపిస్తున్నారు కనీసం కొంతమంది అయినా. ఇక కరోనా గురించి ఊహాగానాలు, ప్రచారాలు వేగంగా జరుగుతున్నాయి. ఎవరి తీరున వారు వీటిని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అలవాటుగా ఉన్న వారు అదే పని చేస్తున్నారు. అలా కాదంటూ..చైనాలో ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న వేరియెంట్ ఇప్పటికే భారతదేశంలో వ్యాపించేసిందని, ఇది ఇండియన్స్ పై ప్రభావం చూపడం లేదంటూ నిర్ధారిస్తున్న మేధావులూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. మరి వీరిలో ఎవరు రైటోఎవరూ చెప్పలేరు. కరోనా విషయంలో ఆది నుంచి ఇలాంటి వాదనలు, సమాధానం లేని ప్రశ్నలే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయంతే.
వ్యాక్సిన్లు ఇప్పుడు పని చేస్తాయా? ఒమిక్రాన్ తో వచ్చిన వ్యాధినిరోధకత మాటేంటి? ఫస్ట్ వేవ్ లో వచ్చిన వారు ఇప్పుడు మళ్లీ కరోనా బారినపడతారా ? రెండో వేవ్ లో ఇబ్బంది పడిన వారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలతో .. ఇలా వందల ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. కోట్ల మందికి కరోనా విషయంలో మళ్లీ కోట్ల సందేహాలు మెదులుతున్నాయి. ఏడెనిమిది నెలలుగా ఉపశమనంగా ఫీలయిన వారు ఇప్పుడు మళ్లీ సందేహాల్లో పడిపోతున్నారు.
అయితే కరోనా ఇన్నాళ్లూ కూడా ఇండియాతో సహా ఏ దేశంలోనూ మానవాళిని వదల్లేదు అనే వాదనా ఉంది. అసింప్టమాటిక్ గానో మరో రకంగానో ఇండియాతో సహా అన్ని దేశాల్లోనూ మనుషులతో సహజీవనం చేస్తూ వచ్చిందనే వాదన మరీ కొట్టి పారయలేనిది. గత నెలలో కూడా కొందరు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆసుపత్రి పాలైన కేసులున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పోస్ట్ కోవిడ్ అంటే ఎప్పుడోరెండేళ్లకిందట కరోనా సోకిందని కాదు, వారు జ్వరం తరహా సమస్యలతో ఇబ్బంది పడిన కొన్నాళ్లకే పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బంది పడిన దాఖలాలు ఆసుపత్రుల రికార్డుల్లో చోటు చేసుకున్నాయి. ఇంకా ఎక్కడి కరోనా అంటూ ధీమాగా ఉన్న సమయంలోనే ఇండియాలో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖలు సరిగా ఆసుపత్రుల వారీగా ఆరాలు తీస్తే కరోనా గురించి మరిన్ని విషయాలు వెల్లడి కావొచ్చు.ఎటొచ్చీ ఇన్నాళ్లూ ప్రజలెంత రిలాక్స్ అయ్యారో.. ప్రభుత్వాలు కూడా కరోనాను పట్టించుకోవడంలో అంతే రిలాక్స్ అయ్యాయి!