సినిమాల్లో హీరోలు, లైఫ్‌లో విల‌న్‌లు గెలుస్తారు

చ‌రిత్ర అడ‌క్కు చెప్పింది విను అని అడ‌వి రాముడిలో ఒక డైలాగ్ వుంది. ఆంధ్ర‌జ్యోతి కూడా సేమ్ డైలాగ్ మీద క‌లం క‌దిలిస్తుంది. శ‌నివారం మ‌ద్య‌నిషేధం పెడ‌తాడ‌ని బార్ ఓన‌ర్ల భ‌యం అని ఒక…

చ‌రిత్ర అడ‌క్కు చెప్పింది విను అని అడ‌వి రాముడిలో ఒక డైలాగ్ వుంది. ఆంధ్ర‌జ్యోతి కూడా సేమ్ డైలాగ్ మీద క‌లం క‌దిలిస్తుంది. శ‌నివారం మ‌ద్య‌నిషేధం పెడ‌తాడ‌ని బార్ ఓన‌ర్ల భ‌యం అని ఒక వార్త‌. ఆదివారం సంపూర్ణ మ‌ద్యాంధ్ర ఇంకో వార్త వ‌డ్డించారు. మ‌ద్య‌నిషేధం వుండ‌దు… వుండ‌బోద‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యాడ‌ట‌. జ‌గ‌న్ మ‌ద్య‌నిషేధం పెడ‌తాడ‌ని ఎవ‌రికీ న‌మ్మ‌కం లేదు. ఆంధ్ర‌జ్యోతికి వుంటే జ‌గ‌న్ త‌ప్పుకాదు.

ప్ర‌తిప‌క్షంలో వున్న‌ప్పుడు మ‌డ‌మ తిప్ప‌ను అనడం స‌హ‌జం. అధికారంలోకి వ‌స్తే పిల్లిమొగ్గ‌లు వేయ‌డం అంతే స‌హ‌జం. న‌ల్ల‌ధ‌నాన్ని తెచ్చి ఇంటికి రూ.10 ల‌క్ష‌లు అకౌంట్లో వేస్తాన‌ని మోదీ అన్నారు. ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని KCR అన్నారు. జ‌రిగిందా? నిషేధ‌మూ అంతే. ఏ మాట‌కి ఆ మాటే చెప్పుకోవాలి. తాగుడు త‌గ్గించ‌డానికి జ‌గ‌న్ కొంత కృషి చేశారు. ధ‌ర‌లు పెంచి హోల్‌సేల్‌గా ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి మోదీ త‌గ్గిస్తే, దీనికి అద‌నంగా మందు ధ‌ర‌లు పెంచి తాగుబోతుల కొనుగోలు శ‌క్తిని జ‌గ‌న్ త‌గ్గించారు. హాఫ్ తాగేవాడితో అదే రేటుకి క్వార్ట‌ర్ త‌గ్గించాడు. ఈ లెక్క‌న మ‌ద్యం వినియోగం త‌గ్గిన‌ట్టే క‌దా!

వైసీపీ వాళ్ల స్టాక్ డైలాగ్ ఒక‌టుంది. టీడీపీ వాళ్లే అన్నిటికి కార‌ణం.

పోల‌వ‌రం ఎందుకు ఆగింది – TDP హ‌యాంలో అక్ర‌మాల వ‌ల్ల‌

రోడ్లు గుంత‌లు -TDP నిర్వాకం

ఫ‌స్ట్ తారీఖు జీతం – TDP వాళ్లు చేసిన అప్పులు

ఇలా ప్ర‌తిదానికి TDP. వాన‌లు స‌కాలంలో ప‌డ‌లేదు, ఎండ‌లు ఎందుకు ఎక్కువున్నాయంటే కూడా టీడీపీ గ‌త పాల‌న నిర్వాకం అనే వాళ్లు కూడా వున్నారు. ఇపుడు నిజాయ‌తీగా మాట్లాడాలంటే రాష్ట్రం మ‌ద్యాంధ్ర కావ‌డానికి మాత్రం చంద్ర‌బాబే కార‌ణం. ఈ పాపంలో జ‌గ‌న్‌ వాటా లేదు. అతి ఉత్సాహంతో అవ‌గాహ‌న లేక విడ‌త‌ల‌వారీ నిషేధం అని ప్లోలో అనేసి దారిన పోయే వైన్‌షాపుల్ని ప్ర‌భుత్వం మెడ‌కి త‌గిలించారు. ప్రెసిడెంట్ మెడ‌ల్ బ్రాండ్లు కూలింగ్ లేని బీర్లు అమ్మి తాగుబోతుల ఉసురు పోసుకున్నాడు.

తాగుబోతులు విస్కీ అభిషేకం చేసి , చికెన్ పకోడిని ప్ర‌సాదంగా పెట్టి నిలువెత్తు ఫొటోకి పూజ చేయాల్సిన వ్య‌క్తి చంద్ర‌బాబు. NTR అధికారంలోకి రాగానే నిజాయ‌తీగా ఫ‌స్ట్ సంత‌కం చేసి నిషేధం తెచ్చాడు. దాన్ని నాశ‌నం చేయ‌డానికి మ‌న బాబు త‌న అనుచ‌రుల్ని ఉసిగొల్పాడు.

చిత్తూరు జిల్లాలో పొరుగు జిల్లాల నుంచి ట్ర‌క్కులకొద్ది మందుని తోలింది చంద్ర‌న్న అనుచ‌రులే. ఎన్టీఆర్ అమాయ‌కుడు. సినిమాల్లో హీరోలు గెలుస్తారు. లైఫ్‌లో విల‌న్‌లు గెలుస్తారు. ఇది తెలియ‌క తాను హీరో అనుకున్నాడు.

95లో ఎన్టీఆర్ దిగిపోయిన‌ప్పుడు రోడ్డు మీద‌కి జ‌నాలు వ‌చ్చి అల్ల‌రి ఎందుకు చేయ‌లేదంటే స్వ‌యంగా తాను తెచ్చుకున్న నిషేధ‌మే. మందు ప‌డితే లోప‌లున్న ఎమోష‌న్స్ అన్నీ బ‌య‌టికి వ‌స్తాయి. ఏడాదిగా మందును దూరం చేసిన ఎన్టీఆర్ మీద కోపం , చంద్ర‌బాబు మీద తిర‌గ‌బ‌డ‌కుండా అడ్డుప‌డింది.

జ‌నం ఆలోచిస్తే త‌మ‌కి ఓట్లు వేయ‌ర‌ని నాయ‌కుల‌కు తెలుసు. చంద్ర‌బాబుకి ఇంకా బాగా తెలుసు. వాళ్లు మ‌త్తులో వుంటేనే సేఫ్ అని ద‌శ‌ల‌వారీగా నిషేధం ఎత్తేసి, కొత్త‌గా బెల్ట్‌షాపులు పెట్టాడు. డ‌బ్బుతో పాటు మ‌ద్యం పంచే సంస్కృతి, చివ‌రికి రైతు కూలీలు కూడా క్వార్ట‌ర్‌ ఇవ్వ‌క‌పోతే పొలంలోకి దిగ‌ని క‌ల్చ‌ర్ తెచ్చింది మ‌న చంద్ర‌న్నే.

నిషేధం కోసం పేజీల కొద్దీ ఉద్య‌మం చేసిన ఈనాడు బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఫిల్మ్‌సిటీ హోట‌ళ్ల‌లో కూడా మందు ప్ర‌వేశ పెట్టి పాపాల్ని క‌డిగేసుకుంది.

గ‌తం ఏమీ గుర్తు లేన‌ట్టు ఆంధ్ర‌జ్యోతి (నిషేధం కోసం ప్ర‌త్యేక సండే స‌ప్లిమెంట్ వేసిన జ్యోతి , త‌ర్వాత చంద్ర‌బాబు సంకీర్త‌న‌లు, మంగ‌ళ‌హార‌తుల‌తో క‌టాక్షం పొందింది). ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో మ‌ద్యాంధ్ర అని తాటికాయ అక్ష‌రాల‌తో వార్త‌లు వేసి ఆనందిస్తోంది.

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం ఏమైపోతుంది అని బాధ‌ప‌డే వాళ్లు 16 మంది ఎమ్మెల్యేల‌తో వైశ్రాయ్‌లో బాబు చ‌క్రం తిప్పిన‌ప్పుడు ఎందుకు అడ‌గ‌లేదో? 

జీఆర్ మ‌హ‌ర్షి