నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులకు ఫరూక్ వ్యాఖ్యలు ఏ మాత్రం రుచించడం లేదు. గౌరవంగా ఆహ్వానిస్తే, తమను అభాసుపాలు చేశాడని సన్నిహితుల వద్ద అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అసలేం జరిగిందంటే…
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకుంది. టికెట్ ఆశిస్తున్న వాళ్లు బలప్రదర్శనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ముందుగా భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, అఖిలప్రియ ప్రసంగించారు. భూమా అంటే తామే అన్నట్టుగా భావించి, టికెట్‌ను కూడా తామే ప్రకటించుకున్నారు.
జగత్ విఖ్యాత్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎన్నికల్లో నిలిచే వయస్సు లేదన్నారు. కావున ఈ దఫా అక్క అఖిలప్రియే పోటీ చేస్తారన్నారు. అక్కైనా, తానైనా ఒకటే అన్నారు. అక్క గెలుపు కోసం పని చేయాలని కోరారు. భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా కుటుంబంలో చిచ్చుపెట్టి తనను ఓడించేందుకు గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయని ఆరోపించారు. మంత్రిగా వున్న సమయంలో తన వాళ్లనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారన్నారు. తన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సురాగానే ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తానన్నారు. తాను కూడా అసెంబ్లీలో ఆయన పక్కనే కూచుంటానన్నారు.
అక్కాతమ్ముళ్ల మాటలు ఫరూక్‌కి కోపం తెప్పించాయి. భూమా కుటుంబ రాజకీయ చరిత్రనంతా ఫరూక్ వేదికపై చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబ పరిస్థితిని కూడా ఆయన చెప్పారు. ఇంతకూ భూమా కుటుంబం అంటే ఎవరని ప్రశ్నించారు. భూమా అంటూ ఇక్కడొకరు, అక్కడొకరు తిరుగుతున్నారని పరోక్షంగా అఖిలప్రియ, భూమా కిషోర్‌ల గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో భూమా అనుచరులెవరు, టీడీపీ కార్యకర్తలెవరిని గట్టిగా ప్రశ్నించారు.
భూమా భాస్కర్‌రెడ్డి, భూమా వీరశేఖర్‌రెడ్డిల వారసుడిగా నాగిరెడ్డిని ప్రజాభిప్రాయం మేరకు టీడీపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా అదే పంథాను పార్టీ అవలంబిస్తుందన్నారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా కుటుంబంలో (అఖిలప్రియ, కిషోర్) ఎవరనేది కార్యకర్తలే తేలుస్తారన్నారు. ఆ మేరకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఫరూక్ ప్రకటించి… అక్కాతమ్ముళ్లకు షాక్ ఇచ్చారు. చివరికి తమకు తాము అభ్యర్థిగా ప్రకటించుకున్నా, అదే వేదికపై ఫరూక్ పరోక్షంగా ఖండించడాన్ని అఖిలప్రియ వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు. ఫరూక్‌ను పిలిపించుకుని అవమానించుకున్నట్టైందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.