రాష్ట్రం విడిపోయినప్పటినుంచి ఏపీకి అవతరణ దోనోత్సవం లేదు. రాజధాని లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అవతరణ దినోత్సవం వద్దనుకున్నారు. అద్భుత రాజధాని నిర్మిస్తున్నామని ఊదరగొట్టీ…కొట్టీ దాన్ని గందరగోళం…గాడాదవాలకంగా తయారుచేశారు. కాలక్రమంలో అద్భుత రాజధాని కాస్త అధ్వాన రాజధానిగా మార్చి ఆయన దిగిపోయారు. జగన్ అధికారంలోకి రాగానే సహజంగానే కథ మొదటికి వచ్చింది. మళ్లీ రాజధాని ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మంత్రి బొత్స సత్యనారాయణ తన శాఖను ఎలా నిర్వహిస్తున్నాడో తెలియదుగాని రాజధాని నిర్మాణంపైన మాత్రం ఏవేవో మాట్లాడుతున్నాడు. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. క్లారిటీ వచ్చాకనే మాట్లాడొచ్చు కదా. ఈలోగా రకరకాల 'కతలు' చెప్పడమెందుకు? 'అమరావతో, హైమావతో, ఏదో ఒక వతి' అంటూ బొత్స నాన్ సీరియస్గా మాట్లాడాడు. రాజధాని నిర్మాణం ఎక్కడ చేయాలనేదాన్ని నిర్ణయించడానికి జగన్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అది ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సివుంది. ఆ నివేదిక వచ్చిందాకా బొత్స ఆగొచ్చు కదా. కాని ఆయన ఆగడంలేదు. ఏవేవో మాట్లాడేస్తున్నాడు.
చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించినవన్నీ అక్రమ కట్టడాలేనని ప్రభుత్వం వేసిన కమిటీ అభిప్రాయపడుతోందట…! ఈ అక్రమాలన్నింటినీ బయటపెట్టాల్సిందేనని చెప్పిందట…! ఈ పనులన్నీ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. రాజధాని మంగళగిరిలో నిర్మించాలని అక్కడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జగన్కు లేఖ రాశారు. కొంతకాలం క్రితం దొనకొండలో రాజధాని అనే ప్రచారం మళ్లీ జరిగింది. రాజధాని ఎక్కడనేది నిర్ణయించడానికి కమిటీ వేసినప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడకుండా ముఖ్యమంత్రి జగన్ కట్టడి చేయాలి. కాని ఆయన గమ్మున ఉండిపోయారు.
కొత్త కమిటీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని సిఫార్సు చేస్తే అమరావతి కథ ముగిసిపోయినట్లే. సాధారణంగా ప్రభుత్వం నియమించే కమిటీలు ఏలినవారి మనసెరిగి నివేదికలు సిద్ధం చేస్తాయి కాబట్టి ఇప్పుడు వేసిన కమిటీ కూడా అమరావతిని కొనసాగించాలని సిఫార్సు చేస్తుందని అనుకోలేం. అమరావతిని ఎలా డిజైన్ చేయాలో, ఏ విధంగా నిర్మించాలో చంద్రబాబు పడిన మల్లగుల్లాలు చూశాం. ఆయన విదేశాలకు వెళ్లి అక్కడి రాజధానులను పరిశీలించిన వైనం చూశాం. రాజధాని నిర్మాణంలో సిగపూర్తో పాటు అనేక దేశాలను భాగస్వాములను చేసిన తీరు చూశాం.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను కూడా సింపూర్ ఎలా ఉందో చేసి రమ్మని ప్రభుత్వ ఖర్చులతో పంపించారు. చివరకు ఆయన రాజధాని నిర్మాణంలో సినిమా దర్శకుడు రాజమౌళితోనూ చర్చలు జరిపారు. ఏపీ పాలకులకు రాజధాని అనేది మొదటినుంచి ఓ ఆటలా తయారైంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో అద్భుతమైన పంచరంగుల చిత్రం చూపించారు. రాష్ట్ర విభజనకు తను కూడా (విభజన చేస్తే అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖలు ఇచ్చారు కదా) కారకుడే కాబట్టి, హైదరాబాదును కోల్పోయి బాధపడుతున్న ప్రజలను ఊరడించడానికి, రాజధాని నిర్మాతగా తన పేరు చరిత్రలో నిలిచిపోవడం కోసం 'అద్భుత అమరావతి నిర్మాణం' అంటూ ఊదరగొట్టారు.
ప్రపంచంలోని ఐదు టాప్ రాజధానుల్లో ఇదొకటి అన్నారు. దేశదేశాలు తిరిగారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఏవేవో ఒప్పందాలు చేసుకున్నారు. పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించానన్నారు. పాపం ఆంధ్రా జనం అమరావతి ముందు హైదరాబాద్ దిగదుడుపే అనుకొని మురిసిపోయారు. చివరకు ఆయన దిగిపోయేనాటికి ఏవో నాలుగైదు నిర్మాణలు చేసి రాజధాని నగరమనే కలర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో అమరావతి గురించి విపరీతమైన ప్రచారం జరగ్గా, జగన్ అధికారంలోకి రాగానే అది చప్పున చల్లారిపోయింది. కథ మళ్లీ 'అనగనగా ఏపీ రాజధాని' అంటూ మొదలైంది.
జగన్ సర్కారు వేసిన కమిటీ నివేదిక వచ్చాక దానిపై చర్చలు జరగాలి. దానిపై అనేకమంది నాయకులు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సామాన్య జనంలోనూ కమిటీ నివేదిక పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది. మీడియాలో వచ్చే కథనాలు సరే సరి. చివరకు ప్రభుత్వం ఆ నివేదికలో ఏవో సవరణలు చేసి దాదాపు అందరికీ ఆమోదయోగ్యంగా రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తరువాత నిర్మాణమనేది మహా యజ్జమే. నిర్మాణానికి కాంట్రాక్టులు, నిధుల సేకరణ గట్రా పెద్ద కసరత్తే. ఇదంతా జరిగి నిర్మాణం మొదలు పెట్టే సమయానికి జగన్ పాలన ముగింపుకు రావచ్చు. అంటే ఎన్నికల హడావుడి మొదలు కావొచ్చేమో…!