జుట్టు వుంటే ఎలాగైనా దువ్వుకోవచ్చు. ఏ స్టయిల్ అయినా చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వ్యవహారం ఇలాగేవుంది. ముందుచూపుతో అటు ఉత్తరాంధ్ర, ఇటు నైజాం మెజారిటీ థియేటర్లను పండగ విడుదలల కోసం ఆయనే అగ్రిమెంట్ లు చేసేసుకున్నారు. దాంతో సినిమాలు తీసుకెళ్లి తప్పనిసరిగా ఆయన చేతిలోనే పెట్టక తప్పడంలేదు. ఎవరన్నా కాస్త ఎక్కువ ఇస్తామన్నా, ఎక్కడ థియేటర్లు ఇవ్వరో అని దిల్ రాజుకే సినిమాలు తీసుకెళ్లి అందిస్తున్నారు.
ఇప్పటికే వైజాగ్, నైజాం కలిపి 30 కోట్లకు అల వైకుంఠపురములో సినిమాను ఎన్నారై చేసారు. విశాఖ తొమ్మిది అరవైకు, నైజాం 20.40కి అని అనుకోవాలి. ఎందుకంటే విశాఖకు 10కోట్ల ఆఫర్ గాయత్రి ఫిలింస్ ఇచ్చింది. నైజాంకు వరంగల్ శ్రీను 22 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారు. అయినా ఇద్దరిని కాదని దిల్ రాజుకే సినిమా ఇచ్చారు. ఎందుకు అంటే కారణం ఇంకేంలేదు.. ఆయనే థియేటర్లు అన్నీ ముందుగా బ్లాక్ చేసేసారు. ఈ సినిమా ఇవ్వకుంటే ఆ థియేటర్లు అన్నింటిలో దర్బార్ నో, సరిలేరు నీకెవ్వరు నో వేసేస్తారేమో అన్న అనుమానం.
ఇదిలావుంటే డిసెంబర్ మూడోవారంలో విడుదలయ్యే ప్రతిరోజూ పండగే సినిమాను కూడా వైజాగ్ దిల్ రాజుకే 2.50 కోట్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడా మరో పది లేదా ఇరవై లక్షలు ఎక్కువ ఇచ్చేవారు వున్నా కూడా థియేటర్లను దృష్టిలో పెట్టుకునే అలా చేసినట్లు తెలుస్తోంది.
థియేటర్లు కాస్త అగ్రిమెంట్ లు చేయగానే నిర్మాతలు భయపడిపోతున్నారని, థియేటర్లు దొరకవేమో అని ఆందోళన చెందుతూ సినిమాను తీసుకెళ్లి దిల్ రాజు చేతిలో పెడుతున్నారని, ఎక్కువ ఇస్తాము, బాగా విడుదల చేస్తామని అన్నా నమ్మలేకపోతున్నారని ఓ డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతానికి అయితే టాలీవుడ్ లో దిల్ రాజు హవా అలా నడుస్తోంది మరి.