జగన్.. ఈ మాట రాష్ట్రానికి తెలిసేలా చెప్పాలి!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్ మస్ సందర్భంగా ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లారు. అక్కడ తండ్రి వైఎస్సార్ సమాధికి నివాళి అర్పించి.. క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్ మస్ సందర్భంగా ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లారు. అక్కడ తండ్రి వైఎస్సార్ సమాధికి నివాళి అర్పించి.. క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పులివెందులలో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునిక బస్సుస్టాండును కూడా జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే బడ్జెట్ ఉన్నదనీ, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే బడ్జెట్ ఉన్నదనీ.. అయితే ఇప్పుడు తమ ప్రభుత్వం చేపడుతున్నన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో ఎందుకు చేయలేకపోయారని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులకంటె ఇప్పుడు తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేస్తున్నదని  కూడా జగన్ వెల్లడించారు. 

రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. రాష్ట్రాన్ని విపరీతంగా అప్పుల్లో ముంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇందులో గోరంతను కొండంతగా దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాల మరియు పచ్చమీడియా యొక్కు కుట్రలు కూడా బోలెడు ఉంటాయి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారనే అపకీర్తి తెచ్చిపెట్టడానికి ఓ వర్గం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులకంటె తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేస్తున్నదని చెప్పడం చర్చనీయాంశం. ఎందుకంటే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. బహిరంగ సభ వేదికగా ఏదో టైంపాస్ మాట చెప్పారని అనుకోవడానికి వీల్లేదు. సాంకేతికంగా కొన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు.. జగన్ చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. పూర్తిగా అబద్ధమే అయితే.. చెప్పే తీరు మరో రకంగా ఉంటుంది. కానీ.. జగన్ చాలా స్పష్టంగా ఆ విషయం చెప్పారు. 

ఇది నిజమే అనుకుంటే గనుక.. ముఖ్యమంత్రి తమ సర్కారు పాత సర్కారు కంటె తక్కువ అప్పులే చేస్తున్నదనే వాస్తవాన్ని కేవలం పులివెందుల ప్రజలకు చెబితే సరిపోదు. యావత్ రాష్ట్రానికి ఆ విషయం తెలియాలి. పచ్చమీడియా ప్రచారాలతో కళ్ల ముందు పొరలుకమ్మి.. ప్రభుత్వం గురించి దురభిప్రాయాలు ఏర్పరచుకునే తరహా ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఏ రకంగా గమనించినప్పుడు తమ ప్రభుత్వం తక్కువ అప్పులు చేస్తున్నదో.. అప్పటి- ఇప్పటి గణాంకాల సహా ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలి. ఆయన ఒక్కడే కాదు.. కేబినెట్ సహచరులు పార్టీ నాయకులు కూడా కేవలం విపక్షాలను దుమ్మెత్తిపోయడం మాత్రమే కాదు.. ఇలాంటి వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా దృష్టి పెట్టాలి. 

కార్పొరేషన్ల రుణాలను కలపడానికి విపక్షాలు డ్రామా నడిపిస్తుంటాయి. నిజానికి కార్పొరేషన్లు అనేది పూర్తిగా వేరే వ్యవహారం. వారి విమర్శలను సీఎం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. కానీ.. తక్కువ అప్పులు చేస్తున్న సంగతిని.. సమర్థంగా ప్రజలకు తెలియజెప్పుకోకపోతే గనుక.. పార్టీ పరంగా వారు విఫలమైనట్టే అనుకోవాలి.