అసలే కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమనిగి థియేటర్లు కళకళలాడిన సంవత్సరం. ఓటీటీల స్టామినా పెరుగుతున్నా… థియేటర్ల వద్ద సందడి స్థిరంగా కొనసాగిన సంవత్సరం. అసలే మంచి సినిమాలు, స్టార్ల సినిమాలు, అంచనాలను అందుకునే సినిమాలను వీక్షించడానికి తెలుగు ప్రేక్షకులు ఆవురావుమని ఎదురుచూసిన సంవత్సరం 2022. ఈ ఎదురుచూపులకు తగ్గట్టుగా భారీ సినిమాలు వచ్చాయి, క్రేజీ కాంబినేషన్లతో కూడిన సినిమాలు విడుదల అయ్యాయి, ఆసక్తిని రేపాయి. అయితే ఎంతగా అంచనాలను ఏర్పరిచాయో అంతే స్థాయిలో నిరాశ పరచడంలో కూడా తెలుగు సినిమాలు తమ పంథాను మార్చుకోలేదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ తమ సినిమాల్లో ఉంటాయని ఊరించిన వీటి రూపకర్తలు, రొటీన్ కథ, కథనాలతో.. ఆకట్టుకోలేని ప్రయోగాలతో నిరుత్సాహ పరిచారు.
ఒకటి కాదు రెండు కాదు.. 2022లో భారీ అంచనాలతో, ఆసక్తులను రేపుతూ విడుదలైన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. కరోనా పరిస్థితుల్లో మేకింగ్ స్లో గా జరగడం, లేట్ కావడం వంటి రీజన్లతో అన్ని సినిమాలూ ఒకే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా రావడంలో అయితే గ్యాప్ లేదు కానీ, ఈ సినిమాలు అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి. అలా బోర్లాపడ్డ సినిమాల జాబితాను ఒక సారి పరిశీలిస్తే..
మొదటి వంతు రవితేజదే!
2022లో మొదట నిరాశ పరిచింది రవితేజ. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన రవితేజ సినిమా *ఖిలాడీ* డిజాస్టర్ గా నిలిచింది. కథ నచ్చి ఈ సినిమాను చేసినట్టుగా రవితేజ ప్రకటించుకున్నా, ఆయనకు పదిహేను నిమిషాల నెరేషన్ తోనే నచ్చిన ఈ కథ వెండితెరపై మాత్రం విసుగు పుట్టించింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన వచ్చి బాగా డిజప్పాయింట్ చేసిన సినిమాగా ఖిలాడీ నిలిచింది
ఆడవాళ్లూ మీకు జోహార్లు
ఎప్పుడో దశాబ్దాల కిందట ఇదే టైటిల్ తో కే బాలచందర్ ఒక సినిమా తీశారు. ఈ టైటిల్ తో బహుశా ఏ బాలచందర్ లెవల్ సినిమాను వీక్షించబోతున్నట్టుగా ప్రేక్షకులు ఆశించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా బోలెడంతమంది మహిళా నటీమణుల భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు పాపం! అయితే టైటిల్ విషయంలో చూపించినంత వైవిధ్యం, ఈ తరానికి సర్ ప్రైజింగ్ గా అనిపించే టైటిల్ అయినా.. ఆ సర్ ప్రైజ్ నెస్ ఆడవాళ్లూ మీకు జోహార్లు ఇవ్వలేకపోయింది. శర్వానంద్ కెరీర్ లో మరో ఫెయిల్యూర్ ను జమ చేసింది ఈ సినిమా. టైటిల్స్ తో ఆసక్తిని రేకెత్తించే కిషోర్ తిరుమల ఈ సినిమా విషయంలోనూ అలా సక్సెస్ అయినా, ఔట్ పుట్ తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
రాధేశ్యామ్
కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే గాక, ప్రభాస్ ఇమేజ్ తో హిందీ బెల్ట్ లో కూడా విడుదలకు ముందు భారీ అంచనాలను రేపిన తెలుగు సినిమా ఇదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాహో తర్వాత బాహుబలి ప్రభాస్ చేసిన ఈ సినిమా తొలి రోజే డివైడ్ టాక్ ను పొందింది. ప్రేక్షకులు ఆశించిన, అంచనాలను పెట్టుకున్న రీతిలో ఈ సినిమా ఆకట్టుకోవడం మాట అటుంచి, అంచనాలన్నీ తిరగబడటంతో తీవ్రమైన డివైడ్ టాక్ ను పొందింది. మూడు వందల నుంచి మూడువందల యాభై కోట్ల రూపాయల స్థాయి బడ్జెట్ అంటూ చేసిన ప్రచారంలో నిజమెంతో కానీ, అందులో సగం స్థాయి డబ్బులనైనాఈ సినిమా వసూలు చేసిందా అనేది అనుమానాస్పదమైన అంశంగా నిలిచింది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత కూడా ఈ సినిమా పట్ల పెద్ద స్పందన రాలేదు. థియేటర్ రిజల్ట్, ఓటీటీ రిజల్ట్ వేర్వేరు అనుకుంటున్న తరుణంలో కూడా రాధేశ్యామ్ రెండింట్లో ఎక్కడా నెగ్గుకురాలేకపోయింది. ప్రభాస్ అభిమానులను ఒకింత అగమ్యగోచరంలో పడేసింది. తదుపరి సినిమాలపై ఒత్తిళ్లను కూడా పెంచింది రాధేశ్యామ్.
డిజాస్టర్ .. ఘనీ!
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కనీసం ప్రచార ఖర్చులనైనా రాబట్టిందో లేదో అనేంత స్థాయి డిజాస్టర్ సినిమాల్లో ఘనీ ముందు వరసలో నిలుస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల రూపాయలు అయితే, వసూళ్లూ నాలుగైదు కోట్ల రూపాయలు కూడా లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తేడా వస్తే ఏ హీరో సినిమాను ఏ స్థాయి డిజాస్టర్ గా అయినా నిలుపుతామనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చారు ప్రేక్షకులు. పవన్ కల్యాణ్ బాలూ సినిమాలో ఆయన పాత్రకున్న రెండో పేరు కూడా ఈ సినిమా పరువును నిలపలేకపోయింది. ఈ ఏడాది డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. ఈ సినిమా విషయంలో హీరో వరుణ్ తేజ్ కూడా అపాలజీ చెప్పుకున్నాడు.
ఆచార్య..ఏమంటివి ఏమంటివి.. పాదఘట్టమంటివా!
బహుశా తెలుగు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఇంతకు మించిన కాంబినేషన్ అక్కర్లేదేమో! మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ బద్ధలైపోవడానికి ఇంతకన్నా మరేం కావాలి? మరేం అవసరం లేనప్పటికీ.. ఇంకా ఈ సినిమాకు బోలెడన్ని సానుకూలతలు యాడ్ అయ్యాయి. తన కెరీర్ లో అప్పటి వరకూ ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు అదనపు అస్త్రమయ్యాడు. అయితే ఇంతజేసీ ప్రేక్షకులను కనీస స్థాయిలో ఆకట్టుకోవడంలో కూడా ఆచార్య విఫలం అయ్యింది. ప్రత్యేకించి ఈ సినిమా కథ, కథనాల విషయంలో విమర్శలు రావడమే కాదు, ట్రోల్స్ కూడా విపరీతంగా సాగాయి. పాదఘట్టం అంటూ మెగాస్టార్ సినిమాను ఏ మాత్రం గ్యాప్ లేకుండా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. చిరంజీవి, రామ్ చరణ్ ల కాంబినేషన్ కలిస్తే.. జరుగుతుందనుకున్న అద్భుతానికి ఆచార్య ఫలితానికీ అసలే మాత్రం పొంతన లేదు. మెగాభిమానులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ సినిమా.
అంటే సుందరానికి
నాని, నజ్రియా లు హీరోహీరోయిన్లుగా అంటే సుందరానికి అనే టైటిల్ కూడా ఆసక్తిని రేపింది. పసలపూడి వంశీ స్టైల్లో ధ్వనించిన ఈ టైటిల్, దాని డిజైన్ మంచి ఎంటర్ టైనర్ ను చూడబోతున్నామనిపించింది. అయితే అంత సీన్ లేదనే విషయం ఈ సినిమా తొలి షో తోనే అర్థం అయ్యింది. టైటిల్ ను చూసి ఉత్సాహంగా, నవ్వుకోవడానికి వెళ్లిన ప్రేక్షకులు నీరసంగా ఇంటికి చేరాల్సి వచ్చింది. 80లలో ఈ తరహా టైటిళ్లతో చాదస్తపు పాత్రలను చూపించి నవ్వులు పండించారు కొందరు దర్శకులు. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడి శైలే చాదస్తంగా ఉండటంతో మొత్తానికే తేడా కొట్టేసింది. ఓటీటీలో ఆడే సినిమా అంటూ కవరింగు ప్రయత్నాలు జరిగినా, అవి కూడా ఏ మంత విజయవంతం కాలేదు.
పక్కా కమర్షియల్
దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ అంటూ ఈ ఏడాది తన మార్కు సినిమాలను వీక్షించే వాళ్లను రంజింపజేసే ప్రయత్నం చేశాడు. గోపిచంద్, రాశీ ఖన్నాల కాంబినేషన్, ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తినే రేపాయి. అయితే సినిమా విడుదలయ్యాకా ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎన్నో షో ల టైమ్ పట్టలేదు. మారుతి సినిమాల నుంచి ఆశించే కనీస వినోదం కూడా ఈ సినిమా ద్వారా అందలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద గోపిచంద్ కు భంగపాటే ఎదురైంది.
రంగరంగ వైభవంగా
ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, అర్జెన్ రెడ్డి అసోసియేట్ డైరెక్టర్ గిరీశయ్యల కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తరహా టైటిల్ తో వచ్చిన రంగరంగవైభవంగా వీక్షించిన ప్రేక్షకులను బాగా విసిగించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని చూసిందే పరిమితమైనంతమంది మాత్రమే. మంచి అంచనాల మధ్య వచ్చి ఈ సినిమా డివైడ్ టాక్ తో దెబ్బతింది. చిన్న సినిమా అనాలో పెద్ద సినిమా అనాలో కానీ.. వసూళ్ల విషయంలో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.
లైగర్
పాన్ ఇండియా ఇమేజ్ అంటూ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు ఒకటికి ఐదారు భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇవి ఫర్వాలేదనిపించుకుంటే ఓకే కానీ, లేకపోతే పరువు ఒకేసారి ఐదారు భాషల్లో పోతోంది. *లైగర్* సినిమా పరిస్థితి కూడా అదే. పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సుదీర్ఘ కాలం మేకింగ్ తో ఏదో అదరగొట్టేస్తుందనేంత స్థాయిలో హడావుడి చేసిన ఈ సినిమా తొలి షో తోనే తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంది. ఫీచర్ ఫిల్మ్ లు తీయడం మానేసి, తనకు తోచినట్టుగా ఏవో డాక్యుమెంటరీలను రూపొందించినట్టుగా.. ఇదే తన స్టైల్ అన్నట్టుగా, చూస్తే చూడంటి లేదంటే లేదన్నట్టుగా సినిమాలు రూపొందిస్తున్న పూరీ జగన్నాథ్ మరోసారి అదే తరహాలో ప్రేక్షకులకు బాగా ఇరిటేషన్ తెప్పించాడు. ఫిలాసఫీలు, పైత్యాలు.. యూట్యూబ్ లో చెప్పుకునేంత వరకూ బాగా ఉంటాయి, అదే ఫిలాసఫీని తమ సినిమాల మేకింగ్ స్టైల్లో కూడా అనుసరిస్తామంటే ఫలితం ఎలా ఉంటుందో లైగర్ తో పూరీకి బాగా అర్థం అయి ఉండాలి. నేనింతే దగ్గర నుంచి పూరీకి ప్రేక్షకులు ఈ పాఠాలు చెబుతూనే ఉన్నారు. చాలా విషయాలను తన మాటలతో అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకునే పూరీకే ప్రేక్షకులు చెబుతున్నది అర్తం కావడం లేదు!
మాచర్ల నియోజకవర్గం
పవర్ ఫుల్ టైటిల్ తో పొలిటికల్ డ్రామా తరహాలో ఏదో బాగానే ఉంటుందనే అంచనాలను ఏర్పరిచిన *మాచర్ల నియోజకవర్గం* ప్రేక్షకుల ఓటింగ్ ను పొందలేకపోయింది. మాచర్ల నియోజకవర్గం నుంచి పోరాడిన హీరో నితిన్ కు మరో డిజాస్టరే మిగిలింది. కొత్త దర్శకుడు టైటిల్ ను అనుకుని సినిమాను ప్లాన్ చేశాడు తప్ప, ముందు కథ రాసుకుని ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించినట్టుగా లేదు. టైటిల్ నచ్చితే సినిమాకు వెళ్లొచ్చు కానీ టైటిల్ సౌండింగ్ బాగుందని కోట్ల రూపాయలు పెడితే కుదరదని ఈ సినిమా నిర్మాణంతో నితిన్ కు కూడా బాగా అర్థం అయి ఉండాలి.
రామారావు ఆన్ డ్యూటీ
ఈ ఏడాదికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ఒక్కో టైటిల్ వైవిధ్యభరితంగా అయితే వచ్చింది. ఇలాంటి ఇంట్రస్టింగ్ టైటిల్స్ లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. రవితేజకు ఈ ఏడాదిలో రెండో డిజాస్టర్ ఈ సినిమా. నలభై కోట్ల రూపాయల పై బడ్జెట్ పెడితే నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు కూడా దక్కలేదని ట్రేడ్ రిపోర్టు చెబుతోంది ఈ సినిమా గురించి. వరస పెట్టి సినిమాలు చేస్తూ ఏదో క్యాష్ చేసుకుందామనుకున్నట్టుగా రవితేజ చూస్తున్నాడు తప్ప, ఇలాంటి సినిమాలు తన కెరీర్ నే మసకబారుస్తున్నాయనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడా? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. ఏడాది కి కనీసం రెండు మూడు సినిమాలు చేయాలన్న ఆయన ఐడియా బాగానే ఉంది కానీ, అందుకోసం మరీ పది, ఇరవై నిమిషాల్లోనే కథ వినేసి నాలుగైదు నెలల పాటు కష్టపడి నలభై కోట్లు పెట్టేయడం వల్ల ప్రయోజనం లేనట్టుగా ఉంది.
థ్యాంక్యూ
మనం, 24 వంటి సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా అంటేనే ఈ సారి మరో చక్కటి అనుభూతి మిగులుతుందని చాలా మంది ఆశించారు. అందులోనూ విక్రమ్ కుమార్ తో ఇది వరకే సినిమా చేసిన నాగచైతన్య హీరో అంటే.. ఇదేదో మనం రేంజ్ సినిమా అని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా థ్యాంక్యూ అంటూ మరో వెరైటీ సింపుల్ టైటిల్ తో ఈ కాంబినేషన్ ఆసక్తిని రేపింది. మొదటి రోజు కాకపోయినా రెండో రోజు అయినా ఈ సినిమాను చూడాలన్న ఆసక్తిని కలిగి ఉన్న ప్రేక్షకులకు మొదటి రోజే డివైడ్ టాక్ చేరిపోయింది. ఈ సినిమాను వీక్షించడం వల్ల ఇది వరకటి సినిమాలను తీసిన విక్రమ్ కుమార్ పైనే ఇంప్రెషన్ మారిపోతుందనే భావనతో చాలా మంది థియేటర్లకు వెళ్లలేదు! ఆ స్థాయిలో ఈ సినిమా నిరాశ పరిచింది. నలభై కోట్ల రూపాయల పై బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అందులో ఐదో వంతు స్థాయి వసూళ్లను కూడా సాధించలేకపోయింది.
దివారియర్
తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు ప్రయత్నం ది వారియర్ కూడా వికటించింది. దశాబ్దంన్నర కిందటే ఇతడు తెలుగు సినిమా ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలప్రదం కాకపోయినా, చివరకు ఇతడి డైరెక్ట్ తెలుగు ఎంట్రీ జరిగింది. కానీ ఇది కూడా టార్గెట్ మిస్ అయ్యింది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా దీని బడ్జెట్ లో సగం స్థాయి వసూళ్లను కూడా పొందలేకపోయింది. ఎప్పుడొచ్చింది వెళ్లిందో ప్రేక్షకుల ఎరుకలో కూడా లేనట్టుగా మాయమైంది.
ది ఘోస్ట్
నాగార్జున తన కెరీర్ గురించి సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని చాటింది ది ఘోస్ట్. వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ నాగార్జున వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు కానీ, వాటిపై ప్రేక్షకుల ఆసక్తి ఏ మేరకు ఉంటోందో నాగార్జున సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ సినిమా నొక్కి చెప్పింది. ఏదో వైవిధ్యత ఉంటే తప్ప పెద్ద హీరోలను కూడా సినీ ప్రియులు ఆమోదించే పరిస్థితి లేదని ది ఘోస్ట్ రిజల్ట్ స్పష్టం చేసింది.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
తన మార్కు కామెడీ సినిమాలకు కాలం చెల్లిపోయి సీరియస్ సినిమాల బాటన పడుతున్న నరేష్ *నాంది*తో ఆకట్టుకున్నా, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మాత్రం మళ్లీ బ్రేకులుపడ్డాయి. ప్రశంసలు పొందిన ఒక హిందీ సినిమాకు ఫ్రీమేక్ తరహాలో రూపొందిన ఈ సినిమా సాదాసీదా అనిపించుకుంది. కామెడీ సినిమాలకు స్వస్తిపలికి కొత్తగా ట్రైచేయాలన్న నరేష్ ప్రయత్నం బాగుంది కానీ సింగిల్ పాయింట్ తో వైవిధ్యభరితమైన సినిమాలు చేసేయడం సాధ్యం కాదని ఈ సినిమా ఫలితం చాటిచెబుతోంది.
జిన్నా
ఇక టైటిల్ తో రేగిన తాటాకుమంటతో కూడా ప్రయోజనం పొందలేకపోయింది మంచు విష్ణు సినిమా. ఈ సినిమాను బాగా ఇష్టపడిన వారి కన్నా ట్రోల్ చేసిన వారే ఎక్కువగా ప్రస్తావించారు. అయితే మరీ ఈ ట్రోల్స్ చెప్పినంత దారుణంగా ఏమీ లేదు అని ఓటీటీల్లో ఈ సినిమాను వీక్షించిన వారు వాదించే ప్రయత్నం చేసినా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎదురైన ఓటమి ముందు ఆ వాదన నిలబడలేదు.