రెండురోజుల వ్యవధిలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించినట్లు గుర్తించారు. చలపతి రావు వయస్సు 78 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు రవిబాబు (నటుడు దర్శకుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తెలుగుచిత్రపరిశ్రమలో అందరితో కలుపుగోలుగా ఉండే స్నేహశీలి, మంచి మనసున్న వ్యక్తి చలపతి రావు మరణం తెలుగు తెరకు తీరని లోటు. రెండురోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నటుల మరణంతో పరిశ్రమలో విషాద ఛాయలు నిండిపోయాయి.
కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే 8న చలపతి రావు జన్మించారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. గూఢచారి 116 సినిమాతో తెలుగుతెరలో ఎంట్రీ ఇచ్చిన చలపతి రావు.. అందరు సీనియర్ నటులతోనూ కలిసి నటించి మెప్పించారు. ప్రతినాయక పాత్రల్లో చలపతిరావు తనదైన ముద్ర వేశారంటే అతిశయోక్తి కాదు.
నెమ్మదిగా చలపతిరావు కెరీర్ కేరక్టర్ యాక్టర్ గా మారింది. అప్పటిదాకా దుష్ట విలన్ అంటే ఇలాగే ఉంటాడేమో అని.. అనిపించుకున్న చలపతిరావు.. ఒక్కసారిగా కేరక్టర్ నటుడిగా పాత్రలతో అందరికీ సొంత ఇంటిలో మనిషిలాంటి గుర్తింపును పొందారు. హాస్యపాత్రలతోనూ తెలుగుప్రేక్షకులను మెప్పించారు. గత ఏడాది విడుదలైన బంగార్రాజు ఆయన చివరి సినిమా.
ఆయన కొడుకు రవిబాబు కూడా చిత్రపరిశ్రమలోనే నిలదొక్కుకున్నారు. నిజానికి సినిమాటోగ్రఫీ చేయడానికి అమెరికా వెళ్లిన రవిబాబు.. తిరిగివచ్చాక దర్శకుడిగా మారారు. నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ అనేక చిత్రాలు రూపొందిస్తున్నారు. చలపతి రావు కుమార్తెల పేర్లు మాలినీదేవి, శ్రీదేవి.
చలపతి రావు విగ్రహం రీత్యా గంభీరంగా కనిపిస్తూ విలన్ పాత్రలకు తగిన వ్యక్తి అనిపిస్తారు గానీ.. ఆయనకు చాలా స్నేహశీలిగా టాలీవుడ్ లో పేరుంది. అందరితో సరదాగా, నవ్వుతూ నవ్విస్తూ ఉంటారని అందరూ అంటుంటారు.