జనసేనాని పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటే సర్వనాశనమే అని కాపు పెద్దలు, మేధావుల భావన. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్రావు కీలక వ్యాఖ్యలు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైగా గతంలో ఈయన జనసేనలో చేరి, ఆ తర్వాత రిటర్న్ అయ్యారు. 2019లో సార్వ త్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరడంతో పాటు పవన్‌కు రాజకీయ సలహాదారుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. పవన్‌ను దగ్గరగా చూసిన అనుభవంతో కాబోలు, ఆయనపై పరోక్షంగా రామ్మోహన్రావు ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
విశాఖలో రాష్ట్ర కాపునాడు సభకు ముందు రామ్మోహన్రావు జనసేనాని పవన్ కేంద్రంగా హెచ్చరికలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా విశాఖ కాపునాడు సభకు సంబంధించి వాల్‌పోస్టర్లలో పవన్ కల్యాణ్ ఫొటోలు ఉండడం వివాదాస్పదమైంది. మరోవైపు ఈ సభకు రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తూ, కేవలం జనసేనాని పవన్ ఫొటోలు మాత్రమే పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇదిలా వుండగా రామ్మోహన్రావు కాపు నేత కావడం గమనార్హం. అలాగే కాపులకు సంబంధించిన సభలోనే ఆయన పరోక్షంగా పవన్ నాయకత్వం వల్ల కులానికి ఒరిగేదేమీ వుండదని చెప్పడం చర్చనీయాంశమైంది.
నిజానికి రామ్మోహన్రావు చెప్పిన అంశాలు కాపులు పరిగణలోకి తీసుకోదగ్గవే. సినిమా వాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యమన్నారు. కులంలో నుంచి సమష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజికవర్గం ముందుకెళుతుందన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడొద్దని సూచించారు. దీని వల్ల బీసీలకు కాపులు దూరమయ్యారని ఆయన చెప్పడం ముమ్మాటికీ నిజం.
పవన్‌కల్యాణ్ పార్టీ స్థాపించిన తొమ్మిదేళ్లైంది. ఇన్నేళ్లలో ఆయన తన సామాజిక వర్గంతో పాటు మిగిలిన సమాజానికి చేసిన మేలు ఏంటి? అని ప్రశ్నిస్తే… ఏమీ లేదనే సమాధానం వస్తుంది. పవన్‌కల్యాణ్‌ను మెజార్టీ కాపు యువత సినీ, రాజకీయ హీరోగా చూస్తుందనడంలో సందేహం లేదు. కానీ పవన్‌కు స్థిరత్వం, కుల, రాజకీయ పరమైన అంశాలపై అవగాహన లేకపోవడమే అసలు సమస్యగా మారింది. సినిమా క్రేజ్‌తో కాపులకే కాదు, ఏ కులానికీ మంచి జరగదని రామ్మోహన్రావు మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కాపులకు రామ్మోహన్రావు మాటలే మార్గదర్శకం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.