విశాఖ రాజధానికి ఎన్నో ముహూర్తాలు వినిపించాయి. అందులో దాదాపు అన్నీ అనధికారికంగానే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఓ మీడియాలో మాత్రం విశాఖ స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ విజయదశమికి మంచి ముహూర్తం పెట్టారని, అది అక్టోబర్ 25 అని కొన్ని నెలల క్రితం న్యూస్ వచ్చింది. దాన్ని పీఠం వర్గాలు ఖండించాయి, అది వేరే సంగతి.
ఇక ఇదే స్వామీజీ ఉగాది 25న విశాఖకు రాజధాని షిఫ్టింగ్ కి ముహూర్తం పెట్టారని కూడా అప్పట్లో మరో ప్రచారం జరిగింది. ఇంకో వైపు తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తూ మరీ ఏప్రిల్, మే నెలలలో కూడా వరసగా ముహూర్తాలు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆగస్ట్ 16 ముహూర్తం కూడా అనధికారిక సమాచారమే.
ఇపుడు ఎటూ ఈ డేట్ సమీపిస్తున్నందువల్ల అక్టోబర్ 25 మీదకే అందరి చూపూ పడుతోంది. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ విశాఖ రాజధానిని అడ్డుకుంటోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా తొందరలోనే జగన్ విశాఖలో పాలనారాజధానిని ఏర్పాటు చేస్తారని కూడా ధీమాగా చెప్పారు. అది దసరావేనని కూడా ఇపుడు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎవరు పెట్టినా కూడా అక్టోబర్ 25 విజయదశమి అద్భుతమైన ముహూర్తమని పండితుల నుంచి అందరూ అంటున్నారు. విజయీభవ అని దీవించే ఆ ముహూర్తాన కనుక రాజధానికి పునాది రాయి పడితే చరిత్రలో నిలిచే నగరంగా విశాఖ జాతకమే మారుతుంది అంటున్నారు. మొత్తానికి విజయదశమి వేళ విశాఖకు రాజయోగం ఖాయమన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది