జనసేన తరపున గెలిచి, ప్రస్తుతం వైసీపీ స్టాండ్ తీసుకున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనాగ్రహ దీక్షల్లో పాల్గొన్నారని, ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారని, మీడియా ప్రతినిధులు కెమెరాలతో వస్తుంటే కండువా తీసి పక్కనపెట్టేశారని, ఆయనపై అనర్హత వేటు వేస్తారంటూ సిల్లీ కథనాలన్నీ ప్రచారంలోకి వచ్చాయి.
ముఖ్యంగా జనసైనికులు ఈ కథనాలతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాపాకను తొక్కేసే ఛాన్స్ వచ్చిందని, పవన్ ని కాదని వెళ్లిపోయినందుకు రాపాకపై వేటు పడుతుందని సంబరపడుతున్నారు.
అనర్హత వేటు ఎందుకు..?
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పార్టీ విప్ ధిక్కరించినా శాసనసభ్యులపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఇక్కడ జనసేనకు రాపాక ఏకలింగం. ఆయనే అన్నీ. శాసనసభాపక్ష నేత అయినా, విప్ అయినా.. ఇంకేదైనా రాపాకే. అందుకే ఆయన విషయంలో పవన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు.
ఇప్పుడేదో అనర్హత వేటు, స్పీకర్ కి ఫిర్యాదు అంటే మాత్రం రాపాక రియాక్షన్ మరోలా ఉండే అవకాశముంది.
రాపాకను కెలికితే ఆమాత్రం గుర్తింపు కూడా ఉండదు..
టెక్నికల్ గా రాపాకను జనసేన ఎమ్మెల్యేగానే గుర్తిస్తారు. అసెంబ్లీ కార్యకలాపాలన్నిట్లో ఆయన జనసేన ఎమ్మెల్యేగానే పాల్గొంటారు. అయితే ఇప్పుడు రాపాకపై అనర్హత వేటు వేయాలంటూ జనసేనాని ముందుకొస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది.
ఎందుకంటే, జనసేన శాసన సభాపక్ష నేతగా.. జనసేన శాసన సభా పక్షం మొత్తాన్ని (టెక్నికల్ గా) వైసీపీలో రాపాక విలీనం చేసే ప్రమాదం ఉంది. ఆయనకింకా ఆ ఆలోచన లేదు కాబట్టి జనసేన బతికిపోయింది. ఆయనకి మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఊరుకున్నారు.
అనర్హత వేటు వేయాలని జనసేన డిమాండ్ చేస్తే.. మొత్తం శాసన సభా పక్షాన్నే విలీనం చేసి అధికారికంగానే పార్టీలో కలుస్తానంటారు ఏకైక ఎమ్మెల్యే రాపాక. అప్పుడు జనసైనికుల రియాక్షన్ ఏంటో..?