పవన్ కల్యాణ్ లో ఆవేశం ఉంది, కానీ అది చాలాసార్లు ఆయనకు అనర్థాలు తెచ్చిపెట్టింది, పెడుతూనే ఉంది. తాజాగా టీడీపీ విషయంలో పవన్ కల్యాణ్ బాగా తొందరపడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓవైపు బీజేపీ నేతలు బాబుని చెడామడా తిడుతున్న సందర్భంలో పవన్ ఒక్కరే టీడీపీ కార్యాలయాలపై దాడి సరికాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రెస్ నోట్ విడుదల చేసి సరిపెట్టకుండా.. మీడియాలో హడావిడి చూసి, ఏదో జరిగిపోతోందనే భ్రమలో తానే నేరుగా తెరపైకి వచ్చి వీడియో వదిలారు.
దీంతో వైసీపీ నేతలకి బాగా మండింది. చంద్రబాబుకి పవన్ వత్తాసు పలకడం సరే కానీ, పట్టాభి వ్యాఖ్యల్ని ఖండించకుండా నేరుగా ఆఫీస్ లపై దాడి గురించి సింపతీగా మాట్లాడ్డం మాత్రం వారికి నచ్చలేదు. అందుకే జనాగ్రహ దీక్షల్లో బాబుతో పాటు పనిలో పనిగా పవన్ ని కూడా ఓ రౌండేసుకున్నారు.
బోసడీకే అని ఏకంగా ముఖ్యమంత్రిని తిట్టినా మేము సైలెంట్ గా ఉండాలా.. అదే తిట్టు పవన్ కల్యాణ్ ని తిట్టి ఉంటే జనసైనికులు ఏం చేసి ఉండేవారని నేరుగా ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు పోసాని ఏం తిట్టారని ఆయనపై దాడి చేశారని, తామెప్పుడూ వ్యక్తిగత దాడులకు దిగలేదని చెప్పారు.
పట్టాభి, పవన్ ని తిట్టి ఉంటే ఈపాటికే ఆయనపై దాడి జరిగేదని, జనసైనికులకు పూనకం వచ్చి ఊగిపోయేవారని, సోషల్ మీడియాలో బూతుల పంచాంగం అందుకునేవారని అన్నారు.
ఏమయ్యా పవన్ నిన్ను బోసడీకే అంటే ఏం చేసేవాడివి? నిన్ను, నీ తల్లిని ఇలా తిడితే నీ రియాక్షన్ ఏంటి..? అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు జనాగ్రహ దీక్షల్లో ప్రశ్నించారు. అంతేకాదు పవన్ ప్యాకేజీ మనిషని, చంద్రబాబు నెల జీతం ఇచ్చి పెట్టుకున్నాడనే వ్యాఖ్యలు కూడా జనాగ్రహ దీక్షల్లో వినిపించాయి.
చంద్రబాబుని తిట్టినప్పటి కంటే, పవన్ పై నేతలు చెలరేగినప్పుడే సభా ప్రాంగణాలు చప్పట్లతో మారుమోగిపోయాయంటే.. వైసీపీ కార్యకర్తల్లో కూడా పవన్ పై ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు.
పవన్ టీడీపీ విషయంలో తొందరపడిన మాట వాస్తవమేకానీ, ఆ తర్వాత ఆయన తప్పు తెలుసుకున్నట్టున్నారు. ఆ వీడియో మినహా.. ఆ తర్వాత ఎక్కడా ఎలాంటి స్టేట్ మెంట్ బయటకు రాలేదు.
కేంద్రబలగాలు, రాష్ట్రపతిపాలన అంటూ టీడీపీ లేనిపోని హడావిడి చేస్తున్నా, గవర్నర్ ని కలిసినా, కేంద్రానికి లేఖలు రాసినా.. పవన్ దేనిపైనా స్పందించలేదు. తొందరపడ్డాననే భావన పవన్ లో ఉంది కాబట్టే ఆయన ఆ తర్వాత సైలెంట్ అయిపోయారని అంటున్నారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తాను తిట్టని తిట్టుకి ఫలితం అనుభవిస్తున్నారు.