ఊహించని విధంగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనన్య పాండే ఇరుక్కుంది. ఎప్పుడైతే ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు క్రాక్ చేశారో, అప్పుడే అందులో అనన్య పాండే పేరు ప్రముఖంగా కనిపించింది. అయితే ఆ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనీయకుండా.. సరిగ్గా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన రోజున పూర్తి వివరాల్ని కోర్టుకు సమర్పించారు.
ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎన్సీబీ అధికారులు, ఆ వెంటనే అనన్య పాండే నివాసంలో సోదాలు నిర్వహించడం, ఆమెను 2 గంటల పాటు తమ ఆఫీసులో ప్రశ్నించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆర్యన్-అనన్య మధ్య వందల కొద్దీ ఛాటింగ్స్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఛాటింగ్స్ లో డ్రగ్స్ ప్రస్తావన కూడా ఉన్నట్టు ఎన్సీబీ అధికారులు ఇప్పటికే నిర్థారించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈరోజు అనన్య పాండేను మరోసారి ఎన్సీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.ఎందుకంటే.. ఆమెకు చెందిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను ఎన్సీబీ ఆధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.
ముంబయిలోని క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ నుంచి షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్నుంచి పలు దఫాలుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కు అప్లయ్ చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరిస్తూ వస్తోంది. అలా 3 వారాలుగా ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్.