నివేదా థామస్…చూడ చక్కని అందం. అంతకు మించి నటన. అందుకే మలయాళీ తార అయినప్పటికీ టాలీవుడ్లో కూడా అభిమానులను సంపాదించుకున్నారామె. జెంటిల్మెన్, నిన్నుకోరి , బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నివేదా ఏర్పరచుకున్నారు.
ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం ఆమె నైజం. సహజంగా అందమైన హీరోయిన్లను మీడియా ప్రతినిధులు, నెటిజన్లు అడిగే ప్రధాన ప్రశ్న…ప్రేమ, పెళ్లిపై మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఏంటి? అని. సరిగ్గా ఇదే ప్రశ్నను అందాల తార నివేదా థామస్‌ను కూడా మీడియా ప్రశ్నించింది.
ఈ ప్రశ్నపై నివేదా భలే గమ్మత్తుగా సమాధానం ఇచ్చారు. ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా ఓ అనుభూతి మిగుల్చుతుంది. ఆ అభిప్రాయం ఆమె మాటల్లోనే…
‘ప్రేమ, పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. ఇవి లేకుండా మనిషి మనుగడే ఉండదు. అందువల్ల వాటి గురించి మాట్లాడటానికి నేనెప్పుడూ వెనుకాడను. ఇక నా విషయానికి వస్తే… పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు సంతో షంగా చేసుకుంటా. ప్రస్తుతానికి నాకు పెళ్లి మీద ఆలోచనలు లేవు. ప్రేమించే తీరికా లేదు. నటిగా నేను నిరూపించుకోవల్సింది చాలా ఉంది.’ అని చెప్పుకొచ్చారా బ్యూటీ హీరోయిన్.
అయితే తనకు కాబోయే జీవిత భాగస్వామిపై ఒక స్పష్టత ఉందని చెప్పారామె. నిజాయితీగా ఉండే వాళ్లని ఇష్టపడతానన్నారు. బాధ్యతలు పంచుకోవడంతో పాటు ప్రయాణాలంటే ఇష్టపడే వాడై ఉండాలని తన మనసులో మాట చెప్పారామె. కాగా ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నివేదా థామస్ నటించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో నాని, సుధీర్‌బాబు హీరోలు.