ఆ వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలను తనకు ఇవ్వమని అంటోంది డబ్ల్యూహెచ్వో, పూర్తి స్థాయి ఫలితాలను నమోదు చేయని వ్యాక్సిన్ ను మనుషుల మీద ప్రయోగించడం మంచిది కాదని.. ప్రపంచంలోని పలు పరిశోధనా సంస్థలు వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.. ఎవరు ఏమనుకున్నా.. తాము కరోనా విరుగుడు వ్యాక్సిన్ ను రెడీ చేసినట్టుగా, దాన్ని మనుషుల మీద భారీ ఎత్తున ప్రయోగించనున్నట్టుగా రష్యా స్పష్టం చేస్తోంది. మరి కొన్ని గంటల్లో రష్యా కరోనా వ్యాక్సిన్ స్ఫూత్నిక్ ఆవిష్కృతం కాబోతోంది.
దాని మాస్ ప్రొడక్షన్ సెప్టెంబర్ నెలకల్లా జరుగుతుందని, అక్టోబర్ లో భారీ ఎత్తున రష్యాలో ప్రజలకు ఈ వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచనున్నట్టుగా రష్యన్ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి స్థాయి పరిశోధనలు చేయకుండానే రష్యా ఈ వ్యాక్సిన్ ను తీసుకొస్తోందని పరిశోధన సంస్థలు అంటున్నాయి. క్లినికల్ ట్రయల్స్ మూడో ఫేజ్ తో పాటే ప్రజలపై కూడా వ్యాక్సిన్ ను ప్రయోగించి ఫలితాలను చూడబోతున్నట్టుగా రష్యా ప్రకటించడాన్ని ఆ సంస్థలు తప్పు పడుతున్నాయి.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి రష్యా. ఆ దేశంలో కరోనా ప్రభావం గట్టినే ఉంది కానీ, మరీ భయంకరమైన స్థాయిలో లేదు. ఎందుకంటే.. రష్యాకు పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంది. తక్కువ జనాభానే కావడంతో… కాస్త రోగ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయగలిగిన వ్యవస్థ వారిది. ఇప్పటికే భారీ ఎత్తున పరీక్షలు కూడా చేసింది. కరోనా వ్యాప్తిలో ఒక దశలో ముందు వరసలో నిలిచినా.. ఆ తర్వాత టెస్టింగ్, ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగింది.
ఇప్పుడు రోజువారీగా రష్యాలో ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. వాటిని డీల్ చేయడం అక్కడి వైద్య వ్యవస్థకు పెద్ద కష్టం కాదు. ఈ రకంగా చూస్తే..ఏదో డమ్మీ వ్యాక్సిన్ తెచ్చి ప్రజల మీద ప్రయోగించేసి, తీవ్ర పరిణామాలను సృష్టించాల్సిన అవసరం లేదు రష్యాకు!
రోజుకు యాభై వేల స్థాయిలో కేసులు నమోదవుతున్న అమెరికా కూడా అలాంటి విపరీత ప్రయోగాలకు పోవడం లేదు. అలాంటిది రష్యా తుంటరి ప్రయోగాలు చేసి తన ప్రజల మీదకు తెస్తుందని భావించడానికి లేదు. బలమైన నమ్మకం ఉంటేనే ఈ సామాన్య ప్రజలకు ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడానికి రష్యా ప్రభుత్వం రెడీ అయి ఉండాలి. ఎంత నియంతృత్వ తరహా పాలనే అయినా… కరోనా ను మరో రకంగా నియంత్రించే అవకాశాలను వదిలి వ్యాక్సిన్ వైపు రష్యా వెళ్లకపోవచ్చు.
ఆ సువిశాల దేశంలో రోజుకు ఐదు వేల కేసులను డీల్ చేస్తూ.. మరి కాస్త జాగ్రత్తలు పాటిస్తే.. అక్కడ కూడా ఏ న్యూజిలాండ్ లాగానో.. కరోనా మటుమాయం కాగలదు కూడా. అయినా.. వ్యాక్సిన్ వైపే మొగ్గు చూపుతోందంటే..తాము రూపొందించిన వ్యాక్సిన్ ను పుతిన్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అందుకే పుతిన్ కూతురుకు కూడా ఆ వ్యాక్సినైజేషన్ ఇప్పటికే చేశారట కూడా!