మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నవనీత్ కౌర్ సహా కుటుంబంలోని 12 మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నవనీత్ కౌర్ ఆరోగ్యం విషమించడంతో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఈ నెల 6న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ అని వచ్చింది. కరోనా బారిన పడిన వారిలో నవనీత్‌తో పాటు పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు. మొదట ఆమె వైద్యం కోసం అమరావతి ఆస్పత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం కుదుట పడకపోగా, మరింత క్షీణించడంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రాజకీయ, సినీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి శివసేన సిట్టింగ్ ఎంపీ ఆనందరావును 34 ఏళ్ల నవనీత్ కౌర్ ఓడించారు. నవనీత్ కౌర్ భర్త, యువస్వాభిమాన్ పార్టీ నాయకుడు రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవనీత్ కౌర్ తెలుగులో శీను వాసంతి లక్ష్మి, రూమ్‌మేట్స్, యమదొంగ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
దీంతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తనకు కరోనా పాజిటివ్ అతని తెలియగానే ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాదు, తనను కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.