తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడం చేతే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. ఏదో గాలికి జనసేన పార్టీ తరఫున పోటీ చేసినట్టుగా, జనసేన కూడా గాలి పార్టీనే అని, అది ఉంటుందో ఉండదో తెలియదని.. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నట్టుగా రాపాక వరప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వీడియో వైరల్ అవుతోంది. తన కార్యకర్తలు, అనుచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలను సెలవిచ్చారు.
రాజోలు నియోజకవర్గంలో తను గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచినట్టుగా ఆయన గుర్తు చేశారు. తన హయాంలో అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని.. వాటి వల్లనే తను మళ్లీ నెగ్గినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. తను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట మొదటి నుంచి ఉన్నట్టుగా వివరించారు. ఆఖరి వరకూ తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందని భావించినట్టుగా, చివరి నిమిషంలో అది సాధ్యం కాకపోవడంతో తను జనసేనలోకి చేరినట్టుగా ఆయన తెలిపారు.
సాధారణంగా కాపుల పార్టీకి రాజోలు పరిధిలోని రాజులు ఓటేయరని, అయితే తన అభ్యర్థన మేరకు వారు జనసేనకు ఓటేశారన్నారు. దళితుల ఓట్లు, రాజుల ఓట్లకు తోడు.. కాపుల ఓట్లు కూడా తనకే పడటంతో విజయం సునాయాసం అయ్యిందని ఆయన విశ్లేషించారు. ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినట్టుగా చెప్పారు.
టికెట్ ఇవ్వాల్సిందన్నా.. ఇవ్వలేకపోయామని జగన్ తో అన్నారని, కలిసి పనిచేద్దామని జగన్ అన్నారని రాపాక చెప్పారు. అప్పటి నుంచి తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కలిసి సాగుతున్నట్టుగా, రాజోలులో ఇప్పటికే ఇద్దరు వైసీపీ లీడర్లున్నారని.. వారి గ్రూపులు వారివని రాపాక వ్యాఖ్యానించారు. అధినేత జగన్ ఒకసారి పిలిచి అందరిని మాట్లాడి.. రాజోలు నియోజకవర్గంలో ఎవరి నాయకత్వంలో పని చేయాలో చెబితే ఒక పనైపోతుందని రాపాక వ్యాఖ్యానించారు!
ఇలా పక్కాగా తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని రాపాక వరప్రసాద్ కుండబద్ధలు కొట్టారు. అధికారికంగా కండువాలు వేసుకోకపోవచ్చు గాక తను అధికార పార్టీనే అని వ్యాఖ్యానించారు. ఇది వరకూ జనసేనలో తనకు ఎలాంటి గౌరవ మర్యాదలూ లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు జనసేన గాలికి పోయే పార్టీ అని, అది ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మరి రాపాక విషయంలో ఇప్పుడు పవన్ ఏమైనా స్పందిస్తారా? స‌్పందించాల్సిన అవసరం లేదని.. ఆయన ఆధ్వర్యంలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడానికి పవన్ కల్యాణే అవకాశం ఇస్తారో!