టైటిల్: 18 పేజెస్
రేటింగ్: 2.5/5
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, అనుపమ, దినేష్ తేజ్, అజయ్, పోసాని, సరయు రాయ్, కిరణ్ వారణాసి
కెమెరా: వసంత్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
విడుదల: 23 డిసెంబర్ 2022
“కార్తికేయ-2” లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ సంవత్సరం నిఖిల్ నటించిన రెండో సినిమాగా వచ్చిన చిత్రం ఈ “18 పేజెస్”. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలవడం, సుకుమార్ రాసిన కథ కావడం, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాని తీసిన సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు కావడంతో విషయమున్న సినిమా అనిపించుకుంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
కథ మొదలైన కాసేపటికే బ్రేకప్ బాధలో కూరుకుపోయిన హీరోకి అనుకోకుండా ఒక డైరీ దొరుకుతుంది. అది 2019నాటి డైరీయే అయినా అందులో దినచర్య రాసిన అమ్మాయి సెల్ఫోన్ వాడకుండా హ్యూమన్ టచ్ కి వేల్యూ ఇస్తూ బతుకుతుంటుంది.
బ్రేకప్పైన డిప్రెషన్లో ఉన్న హీరోకి ఆ డైరీలో కబుర్లు ఊరటనిస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఆ డైరీ రాసిన అమ్మాయిని ప్రేమించేయడం మొదలుపెడతాడు. ఆమె గతాన్ని చదువుతూ అదంతా వర్తమానమనే ఎమోషన్లోకి వెళ్లిపోతాడు. ఎంతెలా అంటే మండు వేసవిలో శాలువా కప్పుకుని తిరుగుతాడు…ఎందుకంటే తాను డైరీలో చదువుతున్న ఎపిసోడ్ వింటర్ సీజన్ కి సంబంధించినది కాబట్టి అట! ఈ సీను వస్తున్నప్పుడు చాలామంది ప్రేక్షకులు పక్కనున్న వారి మొహంకేసి చూసారు!!
ప్యారలెల్ గా వర్తమానంలో హీరో కథ, మూడేళ్ళ క్రితం నాటి హీరోయిన్ కథ నడుస్తుంటాయి. అక్కడామె ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఇక్కడ మన హీరో టెన్షన్ పడిపోతాడు. అక్కడామెకి ఒకతను పరిచయమయ్యాడని రాస్తుంది. ఇక్కడ ఇతను అసూయపడుతుంటాడు. చేతిలో డైరీ ఉంది కదా టపటప చదివేసి పక్కనపెట్టకుండా పాపం మనకోసమే అన్నట్టు రోజుల తరబడి చదువుతాడు.
ఇక హీరోయిన్ పాత్రైతే ఆదర్శానికే ఆశ్చర్యమనిపించేంత ఆదర్శవంతురాలు. కనిపించిన వారందరికీ సాయం చేసేస్తుంటుంది. ఆమె మంచితనం చూసి అందరూ ఆమెకి సాయం చేసేస్తుంటారు.
ఒక మంచి కథని తీసుకుని, సున్నితంగా కథనం నడిపిస్తుంటే ఇలా తక్కువచేసి రాస్తారేంటని అడగొచ్చు. కొన్ని కథలు చెప్పుకోవడానికి బాగుంటాయ్. కొన్ని చదవడానికి ఆసక్తిగా అనిపిస్తే, కొన్ని మాత్రమే థియేటరుకి వెళ్లి టికెట్ కొనుక్కుని చూడడానికి అనువుగా ఉంటాయ్. కొన్ని టీవీలో చూస్తున్నప్పుడు బాగుంటాయ్. అన్ని చోట్లా బాగుండేవి అరుదు. అనుకున్న ప్రతి కథని దృశ్యరూపంగా మలిచేయడం కష్టమైన పని. సినిమా అనేది ఒక మేజిక్. సినిమాటిక్ లిబర్టీస్ ఎంత తీసుకున్నా మరీ సిల్లీగా, ఫోర్స్డ్ గా అనిపించకూడదు, కన్విన్సింగ్ గా ఉండాలి.
మొదటి సగమంతా అబ్బాయిగారు అమ్మాయిగారి అన్వేషణతో నడుస్తుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్టు. ఆ తర్వాత మళ్లీ అన్వేషణ. చివర్లో అమ్మాయిగారు, అబ్బాయిగారు కలుస్తారా లేదా అనే ఉత్కంఠ కలిగించే ప్రయత్నం చేసారు కానీ కథనంలో పట్టు అంతగా లేక ఎక్కడా రోమాంచితాలు కలగవు.
పనిమనిషిగా కనిపించిన అమ్మాయి టీసీయస్ లో జాబ్ చేస్తున్నాను అని చెప్పగానే హాల్లో జనం నవ్వారంటే వాళ్లు దర్శకుడు అనుకున్న ఎమోషన్లో ట్రావెల్ చెయ్యలేదని అర్ధమౌతుంది.
గోపీసుందర్ సంగీతం బాగుంది. ఇలాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్, పాటలు బాగానే చేస్తాడనే పేరునైతే నిలబెట్టుకున్నాడు. శ్రీమణి సాహిత్యం కూడా అన్ని పాటల్లోనూ ట్రెండీగా ఉండి ఆకట్టుకుంది.
ఇతర సాంకేతిక విభాగాలన్నీ పర్వాలేదు.
నిఖిల్ నటన పరంగా వంక పెట్టేందుకేం లేదు కానీ, అతని పాత్ర రూపకల్పనే అన్-కన్విన్సింగ్ గా ఉంది. మొదటి పాటలో డ్యాన్స్ స్టెప్స్ మాత్రం బాగానే వెసాడు.
అనుపమ పరమేశ్వరన్ మరీ నవలానాయకి టైపులో దర్శమిచ్చింది. ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంటుతో నడిచినా ఆమె అతిమంచితనం, మొబైల్ ఫోన్ వాడకపోవడం వంటివి ఫోర్స్డ్ గా అనిపిస్తాయి.
హీరో పక్కన ఫ్రెండ్ గా సరయు రాయ్ తన “7 ఆర్ట్స్” ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ కాస్తంత అశ్లీలాన్ని ధ్వనింపజేసే డైలాగులు కొట్టి నవ్వించింది.
అజయ్, పోసాని రెండు మూడు సీన్స్ లో కనిపించారు. విలన్ గా కిరణ్ వారణాసి ఉన్నంతలో మెప్పించాడు. కానీ మోజో అనే పేరుతో పెద్ద బిల్డప్ ఇచ్చిన విలన్ క్యారెక్టర్ని మాత్రం మరీ ఆటలో అరటిపండుని చేసేసారు.
ఏదో కామెడీ చెయ్యాలని తోచినట్టుగా రాసుకున్న సీన్స్ కూడా ఉన్నాయి. హీరో అదిరిపోయే సాక్ష్యం తెచ్చాడన్న ఆనందంతో జడ్జ్ ముందే లాయర్ విజిలెసే సన్నివేశం చూస్తే అసలిది సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన స్క్రిప్టేనా అనిపిస్తుంది.
కథనం నడుస్తున్నప్పుడు హీరో ఇలా చేస్తే సరిపోతుంది కదా, ఫలానా వాడిని ఆరా తీస్తే పనైపోతుంది కదా అని ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది. కానీ హీరో పాత్రకి ఆ స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఆ కామన్ సెన్స్ పనులేమీ చెయ్యకుండా దర్శకుడు రాసుకున్నట్టుగా ప్రవర్తించి రెండు గంటల సేపు గడిపేస్తాడు. అవన్నీ ఏవిటనేది ఇక్కడ చెబితే కథ రివీల్ చేసినట్టవుతుంది కనుక చెప్పట్లేదు.
కథంతా 2022లో నడుస్తుంటే, హీరోహీరోయిన్స్ మాత్రం ఫోటోలు కూడా చూడని ప్రాచీనయుగం నాటి మనుషుల్లా బతుకుతుంటారు. అది వాళ్లు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం!! స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో హ్యూమన్ టచ్ కొరవడుతోందన్న మాట వాస్తవమే కానీ, మరీ ఇంతిలా టెక్నాలజీకి దూరంగా బతికితేనే మనిషితనం మనతో ఉంటుందని చెప్పడానికన్నట్టుగా మొదలైన కథ, ఎటో వెళ్లి, ఏదేదో జరిగి, ఇంకెక్కడో ముగుస్తుంది.
రాసిన వాళ్లకి, తీసినవాళ్లకి ఈ కథలోని భావోద్వేగపు లోతు అర్ధమయ్యుండొచ్చు కానీ, సగటు ప్రేక్షకుడికి మాత్రం అందడం కష్టం. ముఖ్యంగా క్లైమాక్సులో ట్రెయిన్ సీన్ అయితే అర్ధం అయ్యీ అవ్వని వచన కవిత్వంలా అనిపిస్తుంది. ఈ సీన్ ని ఎప్పుడో 1950ల నాటి సినిమాలో పెట్టుంటే సెట్టయ్యేది. ఇప్పుడు పెట్టడం వల్ల అసలు మనం ఏ కాలంలో ఉన్నామో అని ప్రేక్షకులు తమని తాము గిల్లుకునేలా ఉంది.
బాటం లైన్: నలిగిపోయిన పేజీలు