ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉక్కు సంకల్పంతో పని చేస్తే తప్ప, తండ్రి వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చలేదు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి సొంత జిల్లాతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడడం, వారిని ప్రశ్నించలేని ఏపీ రాజకీయ అధికార, ప్రతిపక్ష పార్టీల అసమర్థతో ప్రజానీకం నష్టపోతోంది.
ఈ నేపథ్యంలో సొంత జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కమలాపురం సభలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై చేసిన కీలక వ్యాఖ్యలు ఆశలు చిగురింప జేస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే…
“సంక్రాంతి సందర్భంగా.. జనవరి చివరి వారంలో జిల్లాలో మరో మంచి కార్యక్రమం జరగబోతోంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అడుగులు జనవరి నెలాఖరులో ముందకు పడతాయి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును గత పాలకులు పట్టించుకోలేదు. ఆ కలను సాకారం చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. జిందాల్ సౌజన్యంతో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ శ్రీకారం చుడతాం” అని జగన్ ఇవాళ ప్రకటించారు.
దేశంలో రెండో అతిపెద్ద స్టీల్ గ్రూప్‌గా జేఎస్‌డబ్ల్యూకు పేరుంది. ఈ గ్రూప్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు సీఎం జగన్ సమక్షంలో ఇటీవల అంగీకరించింది. మొదటి విడతలో రూ.3,300 కోట్లతో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయతలపెట్టారు. రెండో విడతలో మరో రెండు మిలియన్ టన్నులతో కలిపి మొత్తం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రెడీ చేశారు.
ఇదీ ఉక్కు కథ….
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని అంబవరం గ్రామ సమీపంలో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2007, జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ భూమి పూజ చేశారు. కొంత పని కూడా జరిగింది. ఆ తర్వాత 2009లో వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఉక్కు పరిశ్రమ అటకెక్కింది.
2018లో ఎన్నికలకు ఐదు నెలల ముందు చంద్రబాబునాయుడు అదే నియోజకవర్గంలో వైఎస్సార్ శిలాఫలకం వేసిన చోటుకు బదులుగా మరో ప్రాంతంలో భూమి పూజ చేశారు. కంబాలదిన్నె గ్రామంలో నాలుగు వేల ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు భూమి పూజ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి రెడీ అయ్యిందని, కేంద్రం సహకరిం చాలని నాడు సీఎం హోదాలో చంద్రబాబు డిమాండ్ చేశారు. రూ.18 వేల కోట్లతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి, లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. కనీసం ఒక్క ఇటుక రాయి అయినా వేసిన పాపాన పోలేదు.
ఆ తర్వాత 2019లో అధికార మార్పిడి జరిగింది. అదే ప్రాంతానికి చెందిన వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ముచ్చటగా మూడో సారి 2019, డిసెంబర్ 23న జగన్ భూమి పూజ చేశారు. ఈ దఫా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో 3,275.66 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సంకల్పించింది. పరిశ్రమ ఏర్పాటుకు రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో ఒక ప్రత్యేక కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్టు జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత దానిని వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌గా పేరు మార్చింది. మూడేళ్లలో పరిశ్రమను పూర్తి చేస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు.
రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఉక్కు సంస్థ కడపలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని జగన్ చెప్పడం విశేషం. కనీసం ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి మోక్షం కలిగితే రాష్ట్ర ప్రజానీకానికి అంత కంటే కావాల్సింది ఏముంటుంది? తండ్రి వైఎస్సార్ కలను నెరవేర్చిన తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు.