మరో 18 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యర్థులపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శల తీవ్రత పెంచారు. ముఖ్యంగా దత్త పుత్రుడంటూ జగన్ ర్యాగింగ్ చేసే పవన్‌కల్యాణ్‌పై ఇవాళ ఘాటు విమర్శలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో పవన్ పదేపదే పెళ్లిళ్లు చేసుకుంటుంటారనే తీవ్ర విమర్శ చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ కడప జిల్లా కమలాపురం బహిరంగ సభ వేదికగా పవన్ బహు భార్యత్వంపై జగన్ పరుష వ్యాఖ్య చేశారు. చంద్రబాబునాయుడి మాదిరిగా తాను ఈ రాష్ట్రం కాకపోతే, మరో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అననంటూనే చురకలు అంటించారు.
ఇదే తన రాష్ట్రం, ఇక్కడే తన నివాసం అని చెప్పుకొచ్చారు. ఈ గడ్డపై మమకారం ఉందన్నారు. ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే తన కుటుంబం, ఇక్కడే రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే తన విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రధానంగా జగన్ ఇవాళ పవన్‌కల్యాణ్‌పై అక్కసు వెళ్లగక్కారు. వీకెండ్స్‌లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ చెలరేగిపోతుండడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఘాటు విమర్శలకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పవన్ ఏ పదవుల్లో లేకపోవడంతో అవినీతి ఆరోపణలు, ఇతరత్రా చేయడానికి ఎవరికీ అవకాశం ఉండదు. దీంతో అతని వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్లను అస్త్రంగా ప్రయోగించేందుకే జగన్ మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనతో పాటు తన వాళ్లపై అవాకులు చెవాకులు పేలితే వ్యక్తిగత విమర్శలు తప్పవనే హెచ్చరికల్ని జగన్ పంపించారని చెప్పొచ్చు. పవన్‌ను ఇరిటేట్ చేయడానికే బహుభార్యత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది.