టైటిల్: ధమాకా
రేటింగ్: 2.5/5
తారాగణం: రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల, రావు రమేష్, హైపర్ ఆది, ప్రవీణ్, ఆలి, పవిత్ర లోకేష్, తులసి తదితరులు
కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: భీంస్ సెసిరీలియో
నిర్మాత: టి జి విశ్వప్రసాద్
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
విడుదల: 23 డిసెంబర్ 2022
ఈ ఏడు రెండు అతిపెద్ద డిసాస్టర్స్ చవిచూసిన రవితేజకి ఈ “ధమాకా” ఆశల్ని చిగురింపజేసింది. ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ఇదేదో ఆడే సినిమానే అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. టాప్ డైరక్టర్ గా పేరు పొందకపోయినా, కెరీర్లో బ్లాక్ బస్టర్లు లేకపోయినా పర్వాలేదనిపించే నక్కిన త్రినాథరావు దీనికి దర్శకుడు. టాలీవుడ్లో వరుసపెట్టి పెద్ద సినిమాలు తీస్తున్న పీపుల్స్ మీడియా బ్యానర్ పై సినిమా కావడం కారణంగా, యువత మనసు దోచిన శ్రీలీల హీరోయిన్ కావడం వల్ల అంచనాలు బెటర్ గానే ఏర్పడ్డాయి. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం.
సాధారణంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే యాడ్స్ వేసినప్పుడు “డబుల్ ధమాకా” అంటుంటారు. ఇక్కడ టైటిల్ లో “ధమాకా” మాత్రమే ఉంచి డబుల్ అనే పదాన్ని క్యాప్షన్లో పెట్టారు. పోస్టర్లో ఇద్దరు రవితేజల్ని చూపించి ఇది డబులాక్షన్ సినిమా అని ముందే సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది సాదా సీదా డబులాక్షన్ సినిమా కాకూడడని కొత్తదనం చూపించాలని కథకులు బాగా కష్టపడ్డారు. రాసింది ఒక్కరు కాదు ఇద్దరు.
హీరో ఇంట్రడక్షన్ సీన్ బిల్డప్పులేవీ లేకుండా డైరెక్ట్ గా రవితేజ సీన్ తోటే సినిమా మొదలవుతుంది. వెనక నుంచి తలమీద ఎవరో కొట్టడంతో రవితేజ పాత్ర చనిపోవడం, ఆ శవాన్ని మార్చురీలో పెట్టి లాక్ చేయడంతో సినిమా ఓపెనవుతుంది. అక్కడికి 18 రోజుల క్రితానికి వెళ్లి అసలు కథ షురూ అవుతుంది.
స్వామి (రవితేజ) అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు ఫైట్లు గట్రా చేసుకుంటూ కనిపిస్తాడు. అతని ఫైట్సంటే అతని తల్లిదండ్రులకి, చెల్లికి కూడా ఇష్టం. వీడియో కాల్ ఆన్ చేసి మరీ తన ఫైటింగ్ ప్రతిభని వాళ్లకి చూపిస్తుంటాడు ఈ స్వామి. అలా విచిత్రమైన యాంబియన్స్ లో ఈ పాత్ర ప్రవేశమవుతుంది.
అలాగే మరో పక్క ఆనంద చక్రవర్తి (రవిజేజ) తన తండ్రి కంపెనీకి కాబోయే సీఈఓ. చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు. చార్టర్డ్ విమానాలు, రేంజ్ రోవర్ కార్లు…ఇదీ అతని జీవనశైలి. ఎవరి మీదా చెయ్యెత్తి ఎరుగడు.
ఈ కంపెనీని వశపరుచుకోవాలని ఒక విలన్ (జయరాం) ప్రయత్నిస్తాడు. అతను చాలా క్రూరుడు. నచ్చనివాళ్లని గొంతులో కత్తి దింపి చంపేస్తుంటాడు. సెన్సార్ వారు పూర్తిగా నిద్రపోవడం వల్ల ప్రేక్షకులకి ఈ సన్నివేశాలు చూసే అవకాశం చిక్కింది.
ఇప్పటి వరకు ప్రిమైజ్ చూస్తే ఎప్పుడో వచ్చిన చిరంజీవి రౌడీ అల్లుడు, ఎన్.టి.ఆర్ రాముడు భీముడు లాంటి సినిమాలు గుర్తురావడం సహజం. ఇద్దరు రవితేజలు తారుమారై విలన్ని ఆడుకుంటారని అనిపిస్తుంది.
కానీ మన కథకులు తమ మేధస్సుని ప్రయోగించి ఊహించని ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకుల్ని అబ్బురపరిచే ప్రయత్నం చేసారు. అయితే ఆ రచనలో ఐక్యూ తక్కువ, అతి ఎక్కువ అనిపిస్తుంది. ఎంత మాస్ సినిమా అనుకున్నా ప్రేక్షకులు తెలివి మీరారు. లాజిక్కుని పక్కనపెట్టి మ్యాజిక్కుతో ట్రావెల్ కావాలన్నా కనీసమైన కామన్ సెన్స్ వాడాలంటున్నారు. ఈ సినిమాలో చాలా చోట్ల అది లోపిస్తుంది. మరీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా రాసేసుకుని తీసేసిన ఈ మాస్ మసాలా అందరికీ మింగుడుపడదు.. హార్డ్ కోర్ విశాలహృదయులకి తప్ప.
సాంకేతికంగా ఈ సినిమాలో యాక్టివ్ గా ఉన్నది సంగీతవిభాగం. “నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది”, “దండకడియాల్” “పల్సర్ బైక్” పాటలు భీంస్ సెసిరీలియో బ్రాండ్ అనిపిస్తాయి. వాటిల్లో ఫ్రెష్నెస్స్ ఉండి ఆకట్టుకున్నాయి. మిగిలిన పాటలు ఎప్పుడో దశాబ్దాల క్రితమే వినేసిన డెజావూ ఫీలింగ్ తెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓపెనింగ్ సన్నివేశంలో ప్రామిసింగ్ గా వినిపించింది కానీ క్రమంగా ఎందుకో ఆ ఇంపాక్ట్ కంటిన్యూ అవ్వలేదు.
కెమెరా, ఎడిటింగ్ వగైరాలు బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే అటుఇటుగా ఉంది.
నటీనటుల విషాయానికొస్తే ఆలి ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులా కనిపిస్తే హైపర్ ఆది మెయిన్ కమెడియన్ గా ఉన్నాడు. విధి వైపరీత్యం, కాలమహిమ అంటే ఇదేనేమో. అలాగే మరొక కమెడియన్ ప్రవీణ్ కూడా…మరీ చిన్న పాత్ర ఇచ్చి పక్కన పెట్టేసారు ఈ ట్యాలెంటెడ్ కమెడియన్ ని. అయితే హైపర్ ఆది కామెడీ పంచులు జబర్దస్త్ స్కిట్స్ ని తలపిస్తూ ఆకట్టుకున్నాయి.
రావు రమేష్ ఇలాంటి పాత్రలు చాలానే చేసేసాడు. అయితే అతనిపై చిత్రీకరించిన ఇంద్ర స్పూఫ్, ఎం ధర్మరాజు ఎమ్మే తరహా డయలాగ్ నవ్విస్తాయి. రవితేజ-రావు రమేష్ మధ్యన పెట్టిన తిట్ల దండకం మాత్రం చిరాకు పెట్టిస్తుంది. అవసరం లేని నాన్ సింక్ సాగతీత అది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచాలని నానా దినుసులు వేసేయడం వల్ల ఇలా అక్కర్లేని జంక్ సీన్స్ అక్కడక్కడ పడ్డాయి.
తనికెళ్ల, తులసి, సచిన్ ఖేదేకర్, పవిత్ర లోకేష్ తమ పాత్రల పరిధిలో ఒదిగిపోయారు.
శ్రీలీల మాత్రం డ్యాన్సులు బాగా చేసింది. అయితే సాయిపల్లవిని తలపించేలా మరిన్ని కాంప్లికేటెడ్ స్టెప్స్ కూడా వేయించుంటే ఆమె స్టార్డం ఇంకా పెరిగేది. తాను ఎలాగో మంచి డ్యాన్సర్ కనుక చేయగలదు కూడా.
రవితేజ డబలాక్షన్ తన శైలిలో చక్కగా చేసాడు. కథ, కథనం ఎలా ఉన్నా సినిమాని పూర్తిగా షోల్డర్ చేసే ఎనెర్జీ రవితేజకి ముందు నుంచీ ఉంది. అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయింది.
సినిమా మొదటి గంట వరకు ఎటూ కదలదు. అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. కాన్-ఫ్లిక్ట్ పాయింట్ కోసం ఇంటర్వల్ దాకా వేచి చూడాలి. అక్కడొక ట్విస్ట్. సెకండాఫులో అసలు కథ మొదలవుతుంది. పెద్దగా డ్రాగ్ లేకపోయినా బలవంతపు ట్విస్టులు అంతగా రుచించవు. పైగా క్లైమాక్సులో యాక్షన్ ఎపిసోడ్ తో ముగింపు కాకుండా శ్రీకాంత్ అడ్డాల టైపులో అందరూ మంచివారే అన్నట్టు ముగుస్తుంది.
సెలవల సీజన్లో పూర్తి స్థాయి వినోదం పొంది ఈ సంవత్సరానికి ముగింపు పలకాలనుకుని ఈ సినిమాకు వెళితే చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయితే తప్ప ఆ వినోదం అందదు. డబుల్ డోస్ వినోదం అందుతుందనుకుంటే సగం మాత్రమే అందింది.
బాటం లైన్: సగం ధమాకా!