టీఆర్ఎస్‌కు బీఆర్ఎస్‌గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయంగా గుణాత్మక మార్పు జరుగుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట టీఆర్ఎస్ ఎంపీలంతా బీఆర్ఎస్ ఎంపీలుగా మారనున్నారు. కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్‌గా తీర్చిదిద్దిన నేపథ్యంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని వారికి ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. వీరి విజ్ఞప్తిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సానుకూలంగా స్పందించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చేందుకు పరిశీలిస్తామని, అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టీఆర్ఎస్‌ను సాంకేతికంగా బీఆర్ఎస్‌గా మార్చేందుకు ఆ పార్టీ నేతలు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇక దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎంత మాత్రం ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్నది చర్చనీయాంశమైంది. 2024లో సార్వత్రిక ఎన్నికల కంటే, అంతకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్‌లకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ మాటకు విలువ వుంటుంది. లేదంటే దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ఆదిలోనే విఫలమవుతాయి. కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంటుంది.