పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభావార్త చెప్పింది. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్న అభ్యర్థుల వయసును రెండేళ్ల పాటు సడలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ఏపీ పోలీస్ నియామక మండలి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా 6,100 కానిస్టేబుల్ (3,580 సివిల్, 2520 ఏపీఎస్సీ), 411 ఎస్ఐ (315 సివిల్, 96 రిజర్వ్) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో నియామక ప్రక్రియ జరగనుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది జనవరి 22న, ఎస్ఐ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు జరగనున్నాయి.
కానిస్టేబుల్ అభ్యర్థులకు కనీసం 18 నుంచి 32 ఏళ్ల లోపు వుండాలి. అలాగే ఎస్ఐ అభ్యర్థులకు 21 నుంచి 27 ఏళ్ల లోపు వుండాలని ఇటీవల వెల్లడించిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్నేళ్లుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో నిరుద్యోగులు అవకాశం కోల్పోతున్నారనే ఆవేదన వారి నుంచి వ్యక్తమైంది. దీంతో వయసు సడలింపు ఇవ్వాలనే డిమాండ్లు ప్రతిపక్షాలు, నిరుద్యోగుల నుంచి గట్టిగా వచ్చాయి.
వారి విజ్ఞప్తిని సీఎం సానుకూలంగా తీసుకున్నారు. రెండేళ్ల పాటు సడలింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. తాజాగా వయసు సడలింపుతో మరింత మందికి అవకాశం దొరకనుంది.