ఇంత జనం ఎపుడూ చూడలేదా బాబూ

చంద్రబాబుకు ఏ ఏటికి ఆ ఏడు అన్నీ కొత్తే. ఆయన కొత్తగా మాట్లాడుతారు, నిన్నటి ఊసు ఆయనకు గుర్తు ఉందో లేదో కానీ లేనట్లే వ్యవహరిస్తారు. అన్నీ ఈ రోజే అంతా ఈ పూటే…

చంద్రబాబుకు ఏ ఏటికి ఆ ఏడు అన్నీ కొత్తే. ఆయన కొత్తగా మాట్లాడుతారు, నిన్నటి ఊసు ఆయనకు గుర్తు ఉందో లేదో కానీ లేనట్లే వ్యవహరిస్తారు. అన్నీ ఈ రోజే అంతా ఈ పూటే అన్నట్లుగా మాటలు చెబుతూంటారు. చంద్రబాబు తాజాగా ఉత్తరాంధ్రాలో పర్యటిస్తున్నారు.

ఆయన రాజాం లో రోడ్ షో చేశారు. ఇంతటి జనం ఎక్కడా చూడలేదు, నా జీవితంలో అసలు చూడలేదు అని అంటున్నారు. దీనికి ముందు బాబు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కర్నూల్ జిల్లాలలో కూడా టూర్లు వేశారు. అక్కడా ఇదే మాట అన్నారు.

బాబు పద్నాలుగేళ్ళ పాటు సీఎం గా పనిచేశానని చెప్పుకునే వ్యక్తి, ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ అంటారు. నా అంత అనుభవం లేదు అని అంటారు. మరి బాబు ఇంతటి జనం ఎపుడూ చూడలేదు అంటే గతంలో ఆయనకు ఇంత ఆదరణ లేదు అనుకోవాలా. లేక జనాలు రాకపోయినా ఓటేసి గెలిపించారనుకోవాలా.

బాబు చెప్పిన దాన్ని బట్టి చూసినా జనాలకు ఓట్లకు గెలుపుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాలి. బాబు తానుగా చెప్పుకుంటున్నట్లుగానే సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన పాలన ముమ్మారు జనాలు చూశారు. ఆయన మాట తీరు తెలుసు, ఆయన ఏమి మాట్లాడుతారో ఎలా హావభావాలు ఉంటాయో అన్నీ జనాలకు తెలుసు. మరి బాబు దగ్గర కొత్తదనం ఏముందని, కొత్తగా ఎలా పాలన చేస్తారన్న ఉత్సుకత ఉండి జనాలు వస్తారు.

అంటే బాబుకు వచ్చిన జనాలు ఎపుడూ ఉన్నారు. ఆ మాటకు వస్తే 2019 ఎన్నికల వేళ కూడా ఇదే ఉత్తరాంధ్రాలో విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పోటెత్తిన జనాలు అంటూ ఆనాడు కూడా అనుకూల మీడియా హెడ్డింగులు పెట్టి వార్తలు రాసింది. అందువల్ల బాబుకు జనాలు కొత్త కాదు, వారికి బాబు కొత్త కాదు, కానీ ఇపుడు బాబు మాత్రం నేల ఈనిందా అన్నట్లుగా జనాలు వచ్చారంటూ కొత్తగా మాట్లాడడమే వింతగా ఉంది.

వచ్చిన జనాలు అంతా ఓటేస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ కి వచ్చినంతమంది జనాలు ఎవరికీ రారు. తెలుగుదేశం పార్టీ చూస్తే క్యాడర్ బేస్డ్ పార్టీ. అందువల్ల సభలకు తమ్ముళ్ళు జనాలను తేలేని దుస్థితిలో లేరు. పైగా నిన్నటిదాకా రాజాంలో ఉన్న పార్టీకి జనాలు రాకుండా పోతారా. అందువల్ల వచ్చిన జనాలను చూసి నాకు కొండంత ధైర్యం వచ్చింది వచ్చేది అధికారంలోకి మేమే అన్న అతి విశ్వాసానికి టీడీపీ పెద్దలు పోకుండా రియాల్టీతో ఎన్నికలకు వెళ్తేనే బెటర్. 

ఎందుకంటే 2019లో ఎందుకు ఓడిపోయారో ఇప్పటికీ అర్ధం కాని స్థితిలో పార్టీ వారు ఉన్నారంటే భ్రమలకు అసలుకూ మధ్య తేడా తెలుసుకోకపోవడమే కారణం అని అంటున్నారు.