పాత సినిమాల ఆఖరి విలన్ వెళ్లిపోయారు. నవరసాల నటుడు. ఒక దశలో ఆయన కనిపిస్తేనే భయం. తర్వాత అన్నయ్య, మామయ్య, తాతయ్యగా దగ్గరికి తీసుకున్నారు. సత్యనారాయణ లేని సినిమా వుండేది కాదు. ఒకే రోజు రిలీజ్ అయిన దానవీర శూరకర్ణ, కురుక్షేత్రంలో భీముడు, దుర్యోధనుడు.
9 ఏళ్ల వయసులో మోసగాళ్లకి మోసగాడు చూసినప్పుడు జడుసుకున్నాను. కోర మీసాలు, క్రూర చూపులతో సత్యనారాయణ అనుచరులతో గుర్రాల మీద వచ్చాడు. నిధి రహస్యం ఎక్కడ అంటూ ధూళిపాళ్లని చావబాదుతాడు. ఈ లోగా రామదాసు (పాత నటుడు) తొందర పడి పొడి చేస్తాడు. రహస్యం తెలుసుకోకుండా చంపినందుకు సత్యనారాయణ చిరాకు పడతాడు. రక్తం, హత్యలు తెలియని వయసులో నిద్రలో కూడా ఉలిక్కిపడే విలన్ కైకాల.
ఈ సినిమాలోనే నక్కజిత్తుల నాగన్న (నాగభూషణం)ని అన్నం పెట్టి మరీ తంతాడు. కోడిని పులుసుగా కాకుండా, కాల్చి తందూరిగా తింటారని తెలియని అమాయకపు, సామాన్య ప్రపంచం మాది. తందూరి చికెన్ ఒకటి వుంటుందని తెలిసింది ఈ సినిమాలోనే. కడుపు నిండా చికెన్ పెట్టి కక్కే వరకూ తన్నడం ఆయన విలనీ.
హహ్హహ్హ అని నవ్వుతూ, హీరోకి గన్ పెట్టి ఒన్ టూ త్రీ చెప్పే కైకాల, శారదలో అన్నయ్యగా ఏడ్పించాడు. రామయ్య తండ్రిలో ఆయనే హీరో. తాతమనుమడులో మోసకారి కొడుకు. ఉమ్మడి కుటుంబంలో అమాయకపు అన్నయ్య. చాలా సినిమాల్లో హీరోయిన్‌తో కేకలు పుట్టిస్తూ, రేప్ చేయడానికి వెంటపడతాడు. చివర్లో జైలుకు వెళ్లడం, హీరో చేతిలో చావుదెబ్బలు తినడం అలవాటు.
యమగోలలో యముండా అంటాడు. దొంగల వేటలో సైకో బ్లాక్‌మెయిలర్. ముగ్గురు మూర్ఖులులో కమెడియన్. మొరటోడులో మొద్దు హీరో. ఆయనవి విశ్వ రూపాలు.
అడవిరాముడులో నాగభూషణం, సత్యనారాయణల తండ్రీకొడుకుల కాంబినేషన్. కొడుకు ఏం అడిగినా చరిత్ర అడక్కు, చెప్పింది విను అనే తండ్రి. వేటగాడులో రావుగోపాలరావుతో సేమ్ కాంబినేషన్. ఒకే కలర్ డ్రస్, టోపీతో కైకాల విచిత్రంగా వుంటాడు. ఏ పాత్ర వేసినా ఆయనదో ముద్ర. ముఖం మీద క్షణాల్లొ రంగులు మార్చగల నటుడు. నిజ జీవితంలో మాత్రం రాజకీయాల్లో ఇమడలేకపోయాడు.
హీరోకి సమాన విలన్ వుంటేనే కథ రక్తి కట్టేది. కైకాల ఎందరికో సమవుజ్జీ. తెలుగు సినిమాలో ఓ చరిత్ర. 87 ఏళ్ల జీవితంలో దాదాపు 60 ఏళ్లు నటించే అవకాశం అందరికీ రాదు. ఆ అద్భుతం కైకాలకి దక్కింది.
ఎన్నో సినిమాల్లో మరణ సన్నివేశాల్లో ఆయన నటించాడు. కట్ చెప్పగానే మృత్యువు నుంచి బయటికి వచ్చి నవ్వేవాడు. ఇది జీవితపు ఆఖరి షాట్. కట్ చెప్పేవాళ్లు లేరు. చెప్పినా లేచి రాడు. ఒక మహానటుడి ఆత్మకి శాంతి కలగాలి.
జీఆర్ మహర్షి