మరో ఏడాదిన్నరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ సమీకరణలు నెమ్మదిగా మారుతున్నాయి. అధికార పార్టీపై నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగనుంది. ప్రతిపక్షాల వ్యూహం ఇంకా అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ ఒక్కో రోజు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోవచ్చని మెజార్టీ అభిప్రాయం.
ఇదిలా వుండగా జనసేనతో అధికారికంగా బీజేపీ పొత్తులో వుంది. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం ఆ మాట అనడం లేదు. ప్రధాని మోదీ ఇటీవల ఆంధ్రా పర్యటనకు వచ్చినపుడు పవన్ వెళ్లి భేటీ అయ్యారు. సమావేశ వివరాలను మాత్రం ఆయన వెల్లడించకపోవడం గమనార్హం. రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని మాత్రమే పవన్ చెప్పడం చర్చనీయాంశమైంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే… ప్రధాన ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కోవాలంటే తనొక్కడి వల్ల సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయం. అందుకే జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకునేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నారాయన. పవన్‌కల్యాణ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ బీజేపీ అసలు ఒప్పుకోవడం లేదు. బీజేపీని కాదని టీడీపీ వైపు పవన్ వెళ్తారా?అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పదేపదే పవన్ చెబుతున్నారు.
టీడీపీతో కలిసి పోటీ చేస్తారనేందుకు ఈ మాటల కంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ….వైసీపీకి అధికారం దక్కుతుందా? లేదా? అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానం టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటే… పరిణామాలు ఎలా వుంటాయనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్‌ను ఓడించడమే ధ్యేయంగా పవన్ అనుకుని, 10 లేదా 15 సీట్లలో పోటీకి సిద్ధమైతే టీడీపీ నెత్తిన పాలు పోసినట్టే అనేది ఒక చర్చ. 40 లేదా 50 సీట్లలో జనసన పోటీ చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే అనేది రెండో చర్చ.
ఇక 2014లో మాదిరిగా ఆ మూడు పార్టీలు ఏకమైతే మాత్రం వైసీపీ బాగా పోరాటం చేయాల్సి వస్తుందనే చర్చ కూడా లేకపోలేదు. వైసీపీకి మళ్లీ అధికారం రావడం, రాకపోవడం అనేది …ప్రతిపక్షాల కలయికపై ఆధారపడి వుంటుందనేది అందరి మాట. జగన్ శత్రువులు వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీ అధికారానికి భయం లేదని మెజార్టీ అభిప్రాయం. రాజకీయ సమీకరణలపై ఏపీలో అధికారం ఆధారపడి వుందనేది అందరి మాట.